తన వల్ల ఒకరి పెళ్లి ఆగుతోందని తెలిసి.. స్పందించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్!

07-01-2020 Tue 11:57
  • కొచ్చిలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన
  • రామ్ నాథ్ బస చేసే హోటల్ లోనే వివాహం
  • తేదీ మార్చుకోవాలనడంతో రాష్ట్రపతికి ట్వీట్
  • ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశం

తన పర్యటన, తాను బస చేసే హోటల్ కారణంగా ఓ వివాహం ఆగిపోతోందని తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. వివాహం ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, కేరళకు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె ఆశ్లే హాల్ కు వివాహాన్ని తలపెట్టింది. జనవరి 7న... అంటే నేడు వివాహాన్ని కొచ్చిలోని  తాజ్‌ హోటల్‌ లో కల్యాణ వేదికను నిశ్చయించుకుని, నెల రోజుల క్రితమే అడ్వాన్స్ లు ఇచ్చారు.

అయితే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేరళ పర్యటనలో భాగంగా ఇదే తాజ్ హోటల్ లో బస చేయాలని భావించారు. దీంతో 5వ తేదీన వివాహం తేదీని మార్చుకోవాలని ఆశ్లే హాల్ కుటుంబీకులకు హోటల్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు ఆవేదనలో ఉండగా, వధువు, రాష్ట్రపతి భవన్‌ కు ట్వీట్ చేసింది.

తన వివాహం సజావుగా సాగడానికి సహాయం కావాలని కోరింది. ఈ విషయం గురించి తెలుసుకున్న రామ్ నాథ్, వెంటనే స్పందించారు. తన భద్రతా బలగాలను తగ్గించాలని స్థానిక అధికారులను కోరారు. దీంతో అధికారులు స్థానిక పరిస్థితులను విశ్లేషించి, అటు రాష్ట్రపతికి బసను, ఇటు పెళ్లికి ఏర్పాట్లనూ చేశారు. కాగా, నిన్న మధ్యాహ్నం హోటల్ కు వచ్చిన రాష్ట్రపతి, నేడు లక్షద్వీప్ కు వెళ్లనుండగా, ఆశ్లే హాల్ వివాహం కూడా నేడు జరగనుంది.