హీరోయిన్లతో క్రికెటర్లకు వల... విచారణలో బడా బుకీ జతిన్ పలు విషయాల వెల్లడి!

07-01-2020 Tue 11:38
  • నెదర్లాండ్స్ లో తలదాచుకున్న జతిన్
  • బెంగళూరుకు వస్తున్నాడని తెలుసుకుని అరెస్ట్
  • విచారిస్తున్నామన్న సీసీబీ అధికారులు

పలు సంచలనాలకు వేదికైన కేపీఎల్ (కర్ణాటక ప్రీమియర్ లీగ్)లో మ్యాచ్ ఫిక్సింగ్ తో పాటు హీరోయిన్లతో క్రికెటర్లకు వలేసిన కేసులో అంతర్జాతీయ బుకీ జతిన్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. గత కొంతకాలంగా నెదర్లాండ్స్ లో తలదాచుకున్న నితిన్, బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు, విమానం నుంచి దిగగానే అరెస్ట్ చేశారు.  

ప్రస్తుతం జతిన్ ను విచారిస్తున్నట్టు సీసీబీ అధికారి సందీప్ పాటిల్ పేర్కొన్నారు. పలు కేపీఎల్ మ్యాచ్ లతో పాటు, ఇతర బెట్టింగుల్లోనూ అతనికి ప్రమేయం ఉందని, దీనిపై లోతుగా విచారిస్తున్నామని అన్నారు. కాగా, ఇప్పటికే జతిన్ నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. దీంతో జతిన్ తో గతంలో సంబంధాలున్న ఆటగాళ్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడ్డారని సమాచారం.