ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్తత

07-01-2020 Tue 10:42
  • నిన్న వెంకటరెడ్డి హత్య
  • ఆందోళనకు దిగిన గ్రామస్తులు
  • నిందితుడి ఇంటికి నిప్పు పెట్టిన వైనం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురి కావడంతో మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అతడి హత్యను నిరసిస్తూ నిందితుడి ఇంటిపై దాడి చేశారు. నిందితుడి ఇంటికి నిప్పుపెట్టడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి.

నిన్న సిరిపురం-గొలనుకొండ రహదారిలో వెంకటరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైకుపై అతడు తన భార్యతో కలిసి జనగామకు వెళ్లి వస్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వెంకటరెడ్డి బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనకు దిగడంతో గ్రామంలో పోలీసులు బందోబస్తును పెంచారు.