America: వెర్రి ట్రంప్.. నా తండ్రి మరణంతో ముగిసిపోయిందనుకోకు: సులేమానీ కుమార్తె హెచ్చరిక

  • సులేమానీ అంత్యక్రియలకు హాజరైన వారితో కిక్కిరిసిన టెహ్రాన్
  • అమెరికాకు చీకటి రోజులు ప్రారంభమయ్యాయన్న సులేమానీ కుమార్తె
  • అంత్యక్రియలకు హాజరైన పొరుగు దేశాల నేతలు

అమెరికా రాకెట్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిం సులేమానీ కుమార్తె జైనాబ్ సులేమానీ అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. తన తండ్రి బలిదానంతో అంతా అయిపోయిందని మురిసిపోవద్దని, ఇక అమెరికాకు చీకటి రోజులు ప్రారంభమైనట్టేనని అన్నారు. నిన్న నిర్వహించిన సులేమానీ అంత్యక్రియల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సులేమానీ అంత్యక్రియలకు హాజరైన వారితో టెహ్రాన్ నగరం కిక్కిరిసిపోయింది.

లక్షలాదిమంది జనం అంత్యక్రియలకు హాజరయ్యారు. 1989లో మరణించిన ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖోమైనీ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. సులేమానీ మృతికి అంతకుమించిన జనం హాజరు కావడం విశేషం. పొరుగు దేశాల నేతలు కూడా సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీనాబ్ మాట్లాడుతూ.. ‘‘వెర్రి ట్రంప్.. నా తండ్రి బలిదానంతో అంతా అయిపోయిందనుకోకు. ఇక అమెరికాకు చీకటి రోజులే’’ అని హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో సులేమానీని అభిమానించే స్థానిక నేతలు కూడా అమెరికాపై ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పటికే అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News