Ala Vaikunthapuramulo: అల... వైకుంఠపురములో ప్రీరిలీజ్ వేడుకలో కన్నీటి పర్యంతమైన అల్లు అర్జున్

  • అల... వైకుంఠపురములో మ్యూజికల్ ఈవెంట్
  • హాజరైన బన్నీ
  • భావోద్వేగాలతో ప్రసంగం

అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, సునీల్ తదితరులు నటించిన చిత్రం అల... వైకుంఠపురములో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. చివరగా హీరో అల్లు అర్జున్ ప్రసంగించారు.

తాను ఓ బిడ్డకు తండ్రయిన తర్వాత తండ్రి విలువ తెలిసిందని, కానీ లైఫ్ లో తన తండ్రి అంత గొప్పవాడ్ని మాత్రం ఎప్పటికీ కాలేనని తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఓ దశలో మాట్లాడలేక కన్నీటిపర్యంతమయ్యారు. మాటలు రాక మూగబోయారు. బన్నీ కన్నీళ్లు పెట్టడంతో స్టేజ్ కింద ఉన్న అల్లు అరవింద్ స్టేజ్ పైకి పరుగుపరుగున వెళ్లి తనయుడ్ని ఆలింగనం చేసుకుని భుజం తట్టారు. ఆపై కళ్లకు అమర్చుకున్న కాంటాక్ట్ లెన్స్ లు తీసేసి మాట్లాడారు.

"ఆర్య సినిమాలో నటించే నాటికే కోటి రూపాయల సంపాదనపరుడ్నయ్యాను. నా వయసు 20, 21 ఉండొచ్చు... అప్పటికీ ఇప్పటికీ డబ్బుకు లోటు లేదు. పెళ్లయిన తర్వాత మా ఆవిడ్ని ఒక్కటే మాట అడిగాను.. నాకెన్ని కోట్లున్నా నేను మా నాన్న వాళ్ల ఇంట్లోనే ఉంటాను, నీకు ఓకేనా? అని అడిగాను. మా నాన్న అంటే నాకంత ఇష్టం. ఆయనతో సూటిగా వ్యవహరిస్తే ఎంతో స్వీట్ గా ఉంటారు. తేడా వస్తే అంతకంటే తేడాగా వ్యవహరిస్తారు. మా నాన్నకు పద్మశ్రీ వస్తే బాగుండునని కోరుకుంటాను. ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను.. మా నాన్నను సిఫారసు చేయండి" అంటూ ఉద్వేగం చెందారు.

తనకు చాలా గ్యాప్ వచ్చిందని, సరైనోడు, డీజే చిత్రాల తర్వాత ఆహ్లాదకరంగా ఉండే సినిమాలో నటించాలని కోరుకున్నానని అందుకే ఇంత గ్యాప్ వచ్చిందని తెలిపారు. కానీ ఫ్యాన్స్ కారణంగా గ్యాప్ వచ్చిన సంగతే తెలియలేదని అన్నారు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు కానీ తనకు మాత్రం ఆర్మీ ఉందన్నారు. ఇవాళ స్టేజ్ పై ఎవరూ లేకుండా నిల్చున్నానంటే అందుకు కారణం మీరేనంటూ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు.

అంతకుముందు, సామజ వర గమన పాట గురించి చెబుతూ, ఎక్కడికి వెళ్లినా ప్లే చేసేలా ఓ పాట ఉండాలని ముందే నిర్ణయించుకుని రూపొందించిన పాట అదని తెలిపారు. తన భార్య ఆ పాటతో అసహనానికి గురైందని వెల్లడించారు. "ఎక్కడికి వెళ్లినా ఆ సాంగే ప్లే చేస్తున్నారు, నన్ను చూసి ఆ పాటే పాడుతున్నారు, ఇరిటేషన్ కలిగి ఇంటికి వచ్చేశానంటూ మా ఆవిడ చెప్పింది. ఏమైనా ప్రపంచంతో వచ్చే హీరోయిజం కంటే పెళ్లాం ముందు కలిగే హీరోయిజం ఎంతో గొప్పగా ఉంటుందని నాకప్పుడే అర్థమైంది. నా సినిమా ద్వారా తమన్ స్థాయి మరింత పెరగడం చాలా సంతోషంగా ఉంది. ఇక లుక్స్ విషయంలో నేను కొంచెం వీకే. కానీ కెమెరామన్ పీఎస్ వినోద్ మాత్రం నన్ను చాలా అందంగా చూపించారు"  అంటూ అభినందించారు.

తన కుమార్తె అర్హ తనను ఎలా ఆటపట్టించేదో కూడా బన్నీ వివరించారు. "రాములో రాములా పాటకు ఎంతో కష్టపడి చేస్తే, అర్హ దోసె స్టెప్పు అంటూ ఈజీగా అనేసింది. ఆ పాట షూటింగ్ కు మా అమ్మాయి కూడా వచ్చింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చి నాన్న ఏమీ చేయలేదమ్మా, షర్టు లేకుండా గాల్లో దోసెలు వేశాడు అని చెప్పింది. దోసెలు వేస్తేనే మనకు డబ్బులు వస్తాయమ్మా అని నేనంటే, నువ్వు ప్రతి రోజూ దోసెలు వేయ్ నాన్నా అంటూ బదులిచ్చింది" అని వివరించారు.

దర్శకుడు త్రివిక్రమ్ గురించి చెబుతూ ఇంత ఆనందాన్ని మనకు ఇచ్చేది దర్శకుడు ఒక్కడేనని వ్యాఖ్యానించారు. అందరూ పనిముట్లు లాంటివాళ్లని, వాళ్లను ఉపయోగించుకుని అద్భుతమైన బొమ్మ గీసే చిత్రకారుడు దర్శకుడు అని అభివర్ణించారు. నాకు తెలిసి త్రివిక్రమ్ తో తప్ప మరే దర్శకుడితో మూడు సినిమాలు చేయలేదని తెలిపారు. నాపై నాకున్న నమ్మకం కంటే నాపై త్రివిక్రమ్ గారికున్న నమ్మకమే ఎక్కువ అంటూ కితాబిచ్చారు.  

చివరి టాపిక్ ఒకటుందని చెబుతూ, తనకు చిరంజీవి గారంటే ప్రాణం అని తెలిపారు. ఈ కట్టె కాలేవరకు చిరంజీవి గారి అభిమానినేనని స్పష్టం చేశారు. చిరంజీవి తర్వాత తనకు నచ్చింది రజనీకాంత్ అని వెల్లడించారు. అంతేకాదు, సంక్రాంతి సందర్భంగా తమ చిత్రంతో పాటే వస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా విజయం సాధించాలని, మహేశ్ బాబు అభిమానులు కూడా ఆనందం పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఆఖర్లో అడిగి మరీ రాములో రాములో పాట వేయించుకుని స్టేజ్ పై డ్యాన్స్ చేశారు. పాట ప్లే చేయడంలో ఆలస్యమైనా, పాటకు డ్యాన్స్ చేశాకే వెళతానంటూ అభిమానుల్లో హుషారు నింపారు.

More Telugu News