Chandrababu: ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు చాలా బాధేస్తోంది: చంద్రబాబు నాయుడు

  • అమరావతి విషయంలో ప్రభుత్వ విధానాలు సరికాదు
  • ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు
  • ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనాలి
  • ఇంత మందిపై కేసులు పెడతారా? 

అమరావతి విషయంలో ప్రభుత్వ విధానాలు, నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే తనకు చాలా బాధేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో టీడీపీ నేత గద్దె రామ్మోహన్ 24 గంటల నిరాహార దీక్షకు దిగారు.

ఆయనకు మద్దతు తెలిపిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ... 'ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారు. రైతులపై కేసులు పెడుతున్నారు. ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో పాల్గొనాలి. అప్పుడు అంత మందిపై కేసులు పెడతారా? రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు నిండిపోతాయి. అందరికీ పౌరుషం రావాలి, ధైర్యంతో ముందుకు కదలాలి. అన్ని ప్రాంతాల వాళ్లు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతున్నారు. విశాఖ రాజధాని వద్దని అన్ని జిల్లాల వారు కోరుతున్నారు' అని అన్నారు.

'అమరావతిలో పునాదులకు ఎక్కువ ఖర్చు అవుతుందనేది తప్పుడు ప్రచారం. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వెలిసిందే నదుల పక్కన. అటువంటిది నదుల కారణంగా అమరావతిలో నష్టం అని అంటున్నారు. విజయవాడ రాజకీయ చైతన్యానికి మారుపేరు. అమరావతిలో ఇప్పటికే అన్ని భవనాలు ఉన్నాయి. కమిటీల పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. కాలయాపన చేస్తున్నారు' అని చంద్రబాబు అన్నారు.

'ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే దర్యాప్తు జరపండి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విశాఖ దూరంగా ఉంది. మనలో అనైక్యత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని అందరం పోరాడుదాం. ఇది ప్రజా ఉద్యమం కావాలి. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడాల్సి ఉంది. అమరావతి జేఏసీ కిందే మేము పోరాడతాం. అందరినీ కలుపుకొని అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉద్యమాన్ని కొనసాగిద్దాం' అని చంద్రబాబు చెప్పారు.

More Telugu News