JNUSU President Aishe Ghosh: ఈ రోజు నా కూతురుపై దాడి చేశారు.. రేపు నాపైనా చేయచ్చు: ఐషే ఘోష్ తండ్రి

  • ఢిల్లీలోని జేఎన్యూ హింసాత్మకం
  • విద్యార్థులపై దాడులకు పాల్పడ్డ ముసుగులు ధరించిన వ్యక్తులు
  • విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్ కు తీవ్ర గాయాలు

ఈరోజు తన కూతురుపై దాడి చేశారని.. రేపు తనపై కూడా దాడి చేస్తారని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఐషే ఘోష్ తండ్రి అన్నారు. జరిగిన ఘటనతో భయాందోళనకు గురవుతున్నానని చెప్పారు. యావత్ దేశం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోందని అన్నారు. ఘటన తర్వాత తన కుమార్తెతో తాను నేరుగా మాట్లాడలేదని... యూనివర్శిటీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఇతరులు తనకు తెలిపారని చెప్పారు. తన కుమార్తె తలకు ఐదు కుట్లు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కూతురు వామపక్ష భావజాలం కలిగి ఉందని.... ప్రతి చోటా, ప్రతి ఒక్కరూ వామపక్ష భావజాలాన్ని అణచి వేస్తున్నారని ఐషే ఘోష్ తండ్రి అన్నారు.

నిన్న జేఎన్యూలో ముసుగులు ధరించిన వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. రాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడి చేసిన వారిలో యువకులతో పాటు యువతులు కూడా ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో ఐషే ఘోష్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సందర్భంగా ఆమె తల్లి మాట్లాడుతూ, జేఎన్యూ వైస్ ఛాన్సెలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల పెంపుపై నిరసన చేస్తున్న విద్యార్థులతో ఆయన కనీసం చర్చలు కూడా జరపడం లేదని అన్నారు. పోరాటం చేస్తున్న తన కుమార్తె వెనుక ఎందరో విద్యార్థులు ఉన్నారని చెప్పారు. విద్యార్థుల్లో చాలా మంది గాయపడ్డారని అన్నారు. తన కూతురు వెనకడుగు వేయరాదని, పోరాటాన్ని కొనసాగించాలని చెప్పారు.

More Telugu News