New Delhi: జేఎన్‌యూ ఘటనపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీరియస్

  • రిజిస్ట్రార్, ప్రోక్టర్, రెక్టార్లకు పిలుపు 
  • హింసను సహించేది లేదని దుండగులకు హెచ్చరిక 
  • దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల ఆందోళన

జేఎన్‌యూ ఘటనపై కేంద్రమానవ వనరుల శాఖ (ఎంహెచ్ఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను సహించేది లేదని దుండగులను హెచ్చరించింది. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఎంహెచ్ఏ తక్షణం తమ కార్యాలయానికి రావాలని రిజిస్ట్రార్, ప్రోక్టర్, రెక్టార్లను ఆదేశించింది.

మరోవైపు జేఎన్‌యూ ఘటనను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఈరోజు ఉదయం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణం దుండగులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ దేశంలో అశాంతి, హింసలను రేకెత్తించాలనుకుంటున్న వారే ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. వర్సిటీ ప్రాంగణం నుంచి సంఘ్ పరివార్ శక్తులను వెళ్లగొట్టాలని సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. సీఎం కేజ్రీవాల్ అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఆందోళనలు ఉద్ధృతమవుతుండడంతో వర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నారు. బయటి వ్యక్తులతోపాటు మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించడం లేదు.

More Telugu News