Deepika Padukone: యాసిడ్ దాడి బాధిత అమ్మాయిలతో హీరోయిన్ దీపిక పుట్టిన రోజు వేడుక

  • లక్నోలో భర్తతో కలిసి యాసిడ్ దాడి బాధితురాళ్లను కలిసిన దీపిక
  • యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ 'కేఫ్'లో వేడుక
  • ఈ రోజు తమకు చాలా ప్రత్యేకమైన రోజు అన్న లక్ష్మి 

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో ఛపాక్ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈనెల 10న ఛపాక్ విడుదల కానుంది. నిన్న దీపిక తన 34న పుట్టిన రోజు వేడుకను లక్ష్మితో పాటు పలువురు యాసిడ్ దాడి బాధిత అమ్మాయిలతో కలిసి జరుపుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లక్ష్మి ఒక కేఫ్‌ ను నడుపుతున్నారు. అక్కడకు తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి వెళ్లిన దీపిక పదుకునే కేక్‌ కట్ చేశారు. మరికొందరు యాసిడ్ దాడి బాధితులు కూడా ఇందులో పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ... 'ఈ రోజు మాకు చాలా ప్రత్యేకమైన రోజు. దీపిక పుట్టినరోజుని ఆమెతో కలిసి యాసిడ్ దాడి బాధితులంతా జరిపారు. ఛపాక్ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకోసం ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇతరుల సాయం తీసుకోవాలని చూడకుండా యాసిడ్ దాడి బాధితులు సొంతంగా గళం విప్పాలి' అని తెలిపారు.

యాసిడ్ దాడి బాధితురాలు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. 'రణ్‌వీర్ సింగ్ తో కలిసి వచ్చి దీపిక తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఛపాక్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో దీపిక అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో నేను కూడా నటించాను. ఈ సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. యాసిడ్ దాడి బాధితుల పట్ల ప్రజలు చూపిస్తోన్న తీరు ఈ సినిమా వల్ల మారుతుందని నేను భావిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

More Telugu News