Hyderabad: వేగం యాభై దాటితే జేబుకు చిల్లే : బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నిబంధనలు కఠిన తరం

  • ఓ వ్యక్తికి జరిమానా విధించిన పోలీసులు 
  • వాహన చోదకులకు మైకుల ద్వారా హెచ్చరిక 
  • సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ

హైదరాబాద్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ వంతెనపై వాహనాల రాకపోకల విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వంతెనపై 50 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లరాదని స్పష్టం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వాహన చోదకులను గమనిస్తున్నారు. 58 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పటికే వాతపడింది. ఫ్లై ఓవర్ పై గంటకు వాహన చోదకులు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారని పోలీసులు గుర్తించారు.

గతంలో 70 కిలోమీటర్ల వేగం దాటితే వెయ్యి రూపాయలు జరిమానా విధించే వారు. తాజాగా యాభై దాటినా పడుతోంది. అలాగే లేన్ల డివైడర్ లైన్ క్రాస్ చేసినా వాత పడుతుంది. వంతెనపై మూడు లేన్లు (వరుసలు) ఉన్నాయి.

వాహన చోదకులు ఓ లేన్లో ప్రయాణిస్తూ మధ్యలో మరో లేన్లోకి, ఈ చివరి నుంచి ఆ చివరికి మారుతుండడంతో వెనుక నుంచి వచ్చే వాహన చోదకులు తికమక పడుతున్నారు. దీంతో మొదటి లేన్లో (ఎడమ) ద్విచక్ర వాహనాలు, మిగిలిన రెండు లేన్లలో ఇతర వాహనాలను అనుమతిస్తున్నారు. వంతెనపై సెల్ఫీలు, ఫొటోలకు దిగినా కఠినంగా వ్యవహరించనున్నారు.

More Telugu News