Prakasam District: పొరపాటున గుండుసూదిని మింగేసిన ఇంజినీరింగ్ విద్యార్థి.. ఊపిరితిత్తుల్లో చిక్కుకోవడంతో విలవిల!

  • నోట్లో పెట్టుకున్న సమయంలో నవ్వించిన స్నేహితులు 
  • మింగేయడంతో ఊపిరితిత్తులోకి చేరిన వైనం 
  • అత్యవసర ఆపరేషన్ చేసి తీసిన వైద్యులు

పొరపాటున మింగేసిన గుండు సూది కడుపులోకి వెళ్లకుండా ఊపిరితిత్తుల్లో చిక్కుకోవడంతో ప్రాణాపాయంతో విలవిల్లాడుతున్న ఇంజినీరింగ్ విద్యార్థిని ఆపరేషన్ చేసి వైద్యులు కాపాడారు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా ఒంగోలు అంజయ్య రోడ్డుకు చెందిన ఓ విద్యార్థి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కళాశాల నోటీసు బోర్డులో ఓ పేపర్ పెట్టాల్సి ఉండడంతో వెళ్లాడు. నోట్లో గుండె సూది పెట్టుకుని పేపర్ ను బోర్డులో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా స్నేహితులు నవ్వించారు. ఆ సమయంలో గుండె సూది కాస్తా నోట్లోకి వెళ్లిపోయింది.

అయితే, అది కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లో చిక్కుకుంది. ఆందోళనకు గురైన విద్యార్థి నగరంలోని కిమ్స్ వైద్యులను సంప్రదించగా వారు స్కానింగ్ తీయించారు. ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న గుండె సూదిని గుర్తించి అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్నారు.

తల్లిదండ్రుల ఆమోదంతో క్లిష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్సలో పాల్గొన్న డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ అనూషలు మాట్లాడుతూ 'ఫ్లెక్సిబుల్ ఫైబ్రో ఆప్టిక్ బ్రాంకోస్కోపీ' ద్వారా ఎలాంటి రక్తస్రావం లేకుండా శస్త్రచికిత్స పూర్తి చేసినట్లు తెలిపారు.

More Telugu News