Iran: ఇరాన్-అమెరికా పోరు.. భారత ఎగుమతిదారుల గుండెల్లో గుబులు!

  • మన నుంచి టీ పొడి, బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్న ఇరాన్
  • ఎగుమతులు ఆపేయాలన్న ఏఐఆర్ఈఏ
  • కామన్‌వెల్త్ దేశాల తర్వాత దిగుమతుల్లో ఇరాన్ టాప్

ఉరుమురిమి మంగళం మీద పడిందంటే ఇదే కాబోలు. ఇరాన్-అమెరికా మధ్య పోరులో భారత్‌లోని ఎగుమతిదారులు నలిగిపోతున్నారు. ముఖ్యంగా టీ పొడి, బాస్మతి బియ్యం పరిశ్రమల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) దేశాల తర్వాత భారత్ నుంచి ఆ స్థాయిలో టీ పొడిని దిగుమతి చేసుకుంటున్న దేశం ఇరానే.

గతేడాది నవంబరు వరకు కామన్‌వెల్త్ దేశాలు భారత్ నుంచి 5.28 కోట్ల కిలోల టీపొడిని దిగుమతి చేసుకున్నాయి. అదే సమయంలో ఇరాన్ ఒక్కటే 5.04 కోట్ల కిలోల టీ పొడిని భారత్ నుంచి దిగమతి చేసుకుంది. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు టీ పొడి ఎగుమతులపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు, ప్రస్తుతం నెలకొన్న యుద్ధమేఘాలు చెదిరిపోయే వరకు ఇరాన్‌కు బాస్మతి బియ్యం ఎగుమతులను నిలిపివేయాలని ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఏఐఆర్ఈఏ) ఎగుమతిదారులను కోరింది. గడిచిన త్రైమాసికంలో భారత్ రూ.32,800 కోట్ల విలువైన బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయగా, అందులో ఇరాన్ వాటానే రూ.10,800 కోట్లు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ‌-నవంబరు మధ్య  రూ. 17,700 కోట్ల విలువైన 23.64 లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని భారత్ ఎగుమతి చేసింది. ఇందులో ఇరాన్ వాటా రూ.4,500 కోట్లు కావడం గమనార్హం. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని, కాబట్టి తాము మళ్లీ చెప్పే వరకు ఇరాన్‌కు ఎగుమతులు నిలిపివేయాలని ఏఐఆర్ఈఏ కోరింది.

More Telugu News