Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కుమార్తెతో కేటీఆర్... పక్కనే చెవిరెడ్డి!

  • నేడు వైకుంఠ ఏకాదశి
  • తిరుమలకు పోటెత్తిన ప్రముఖులు
  • వీఐపీల దర్శనానికే రెండున్నర గంటల సమయం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రముఖులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకునేందుకు దాదాపు 2 వేల మందికి పైగా వీఐపీలు తిరుమలకు వచ్చినట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. వీరికి స్వామి దర్శనం చేయించేందుకు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టిందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్, తన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు ముందే తిరుమలకు చేరుకోగా, ఆయనకు స్థానిక నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. కేటీఆర్ దర్శనానికి వెళ్లే సమయంలో ఆయనతో పాటే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ కుటుంబీకులు ఆలయంలో ఉన్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌ గౌడ్, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత తదితరులు స్వామిని దర్శించి తరించారు.

ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌ లు సుబ్బరామిరెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. గాలి జనార్దన్‌ రెడ్డి కుటుంబీకులు కూడా తిరుమలకు వచ్చి, వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌, సుమలత, సప్తగిరి తదితర సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. 

More Telugu News