Nakka Anandababu: వారం రోజుల్లోనే అలా జరగడం అన్నది అంతుబట్టడం లేదు: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

  • రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని తరలింపు
  • వెనక్కి తగ్గకుంటే ఉద్యమం ఉద్ధృతం
  • రాజధాని పేరుతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వారం రోజుల్లోనే నివేదికలు ఎలా వచ్చాయో తనకు అంతుబట్టడం లేదని ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిన్న తెనాలి మార్కెట్ సెంటర్‌లో నిర్వహించిన ‘మన రాజధాని-మన అమరావతి’ నిరసన కార్యక్రమానికి ఆనందబాబు హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని పేరుతో వైసీపీ నేతలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అమరావతికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు ఉందని, ఒక్క వైసీపీ మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధానిని విశాఖలో పెడుతున్నట్టు అనిపిస్తోందన్నారు. రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రాజధానిని తరలించవద్దని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా సీఎం జగన్‌కు కనబడడం లేదని ఆనందబాబు మండిపడ్డారు.

More Telugu News