నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లి నన్ను ఎన్ని మాటలన్నావు శాంతీ!: చిరంజీవి

05-01-2020 Sun 23:10
  • సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరు ప్రసంగం
  • ఆసక్తికర వ్యాఖ్యలతో రక్తికట్టించిన మెగాస్టార్
  • విజయశాంతితో భావోద్వేగాలు పంచుకున్న చిరంజీవి

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేరుపేరునా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుని, జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నా హీరోయిన్ విజయశాంతి అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. హీరో మహేశ్ బాబు గురించి చెబుతూ, మహేశ్ ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది.. అయితే ఆ చిరునవ్వు వెనుక చిన్న చిలిపిదనం ఉంటుంది... దొంగ అంటూ వ్యాఖ్యానించారు. తక్కువ సినిమాలతోనే సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడంటూ సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందించారు.

మహేశ్ కి ఎస్సెమ్మెస్ పెట్టాను...

"ఇటీవల పేపర్ చూస్తుంటే మహేశ్ బాబు స్టిల్ ఒకటి కనిపించింది. మహేశ్ బాబు మిలిటరీ డ్రస్సులో ఉన్నాడు. చూడగానే కత్తిలా ఉన్నాడనిపించింది. నాకేదైనా మంచి ఫీలింగ్ కలిగితే వెంటనే మహేశ్ తో షేర్ చేసుకుంటాను.  ఎస్సెమ్మెస్ పెడితే వెంటనే స్పందించాడు. తను నటిస్తున్న కొత్త చిత్రం గురించి చెప్పాడు. అలా చెప్పాడో లేదో కొన్నినెలలకే షూటింగ్ కూడా పూర్తయింది, మీరే చీఫ్ గెస్ట్ గా రావాలని నన్నడిగాడు. మరీ ఇంత ఫాస్ట్ గా ఎలా తీయగలిగారని ఆశ్చర్యంగా ఉంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వేగంగా సినిమాలు తీయడం అలవర్చుకోవాలి, తద్వారా చిత్ర పరిశ్రమలోని అందరూ కళకళలాడతారు.

మహేశ్ బాబు ఈ సినిమా పూర్తయ్యేవరకు ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. అందువల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. నేను కూడా చిత్రం తర్వాతే తీసుకునేవాడ్ని, రామ్ చరణ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు అనుసరిస్తున్న పంథా నిర్మాతలకు ఊరట కలిగిస్తుంది. రెండంకెల వడ్డీకి బదులు ఒక్క అంకెతోనే బయటపడతారు నిర్మాతలు" అంటూ తెలిపారు. ఇక తన కొత్త చిత్రం గురించి చెబుతూ, 99 రోజుల్లోనే తన సినిమా పూర్తి చేయాలంటూ అక్కడే ఉన్న దర్శకుడు కొరటాల శివకు సరదాగా ఆర్డర్ జారీ చేశారు. ఒక్కరోజు దాటినా సహించేది లేదంటూ మురిపెంగా హెచ్చరించారు.

కృష్ణగారికి దాదాసాహెబ్ పురస్కారం రావాలి..  

సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ, దక్షిణాదిలో అంతటి సీనియర్ నటుడు మరెవ్వరూ లేరని, అంతకంటే పెద్ద నటుడు మరొకరు ఉన్నారని తాను అనుకోవడంలేదని తెలిపారు. అయితే కృష్ణ గారికి దక్కాల్సిన గౌరవం దక్కలేదేమోనని విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయనకు వచ్చేలాగా చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు. 350కి పైగా సినిమాల్లో నటించి, మరికొన్ని చిత్రాలు నిర్మించి, కొత్తదనం కోసం ముందుండే సాహసోపేతమైన వ్యక్తి అని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అన్ని విధాలా సరైనదని అభిప్రాయపడ్డారు. మహేశ్ బాబు తనకు పేరు తెచ్చేలా ఎదుగుతుండడం కృష్ణ గారు ఎంతో గర్విస్తుంటారని తెలిపారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, రిలీజ్ కు ఒకరోజు ముందే తనకు ప్రీమియర్ వేస్తున్నారని చిరంజీవి వెల్లడించారు. హీరోయిన్ రష్మిక మందన్న గురించి చెబుతూ, తనను కాంట్రాక్ట్ కు తీసుకుందంటూ చమత్కరించారు. చలో సినిమా ఈవెంట్ కు వెళితే అక్కడ తొలిసారి కనిపించిందని, ఆ తర్వాత తమ బ్యానర్ లో నిర్మితమైన గీతగోవిందం చిత్రం కోసం వెళితే అక్కడా రష్మికే కనిపించిందని అన్నారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు కోసం వస్తే ఇక్కడా రష్మికేనంటూ నవ్వులు పూయించారు.

పదిహేనేళ్ల తర్వాత కనిపించావ్ శాంతీ!

చివరగా విజయశాంతి గురించి మాట్లాడారు. "సండే అననురా మండే అననురా ఎన్నడూ నీదాన్నిరా.. అంటూ మాట ఇచ్చి నా మనిషిగా నా హీరోయిన్ గా ఉండకుండా పదిహేనేళ్ల తర్వాత ఇప్పటికి కనిపించింది. విజయశాంతితో హీరోయిన్ గా కంటే ఎక్కువ అనుబంధం ఉంది. మద్రాస్ టీ నగర్ లో మా ఇంటి ఎదురుగానే విజయశాంతి కూడా ఉండేది. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా హాజరవుతూ సొంతమనుషుల్లా మెలిగేవాళ్లం" అని వివరించారు. అంతేకాదు, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను విజయశాంతి విమర్శించిన వైనాన్ని చిరంజీవి సరదాగా ఓ స్కిట్ రూపంలో ప్రదర్శించారు.
 
"నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లావు కదా, నన్ను అన్ని మాటలు అనాలని నీకెందుకనిపించింది?" అని ప్రశ్నించారు. దానికి విజయశాంతి స్పందిస్తూ, "చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త" అంటూ నవ్వుతూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఎప్పటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంటూ విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాను విజయశాంతితో నటించిన సినిమాల పాటలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. పదిహేనేళ్ల తర్వాత వచ్చినా నీలో అదే పొగరు, అదే విగరూ శాంతి.. ఏం తగ్గలేదు, చూస్తుంటే ఇక్కడుండాల్సిన గుండె ఇక్కడకి వస్తోంది అంటూ చమత్కరించారు. రాజకీయాలు మనుషుల మధ్య శత్రుత్వాలను పెంచితే, సినిమా రంగం మాత్రమే స్నేహాన్ని పంచుతుందని వ్యాఖ్యానించారు.

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టవ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో అల.. వైకుంఠపురములో చిత్రం కూడా వస్తోందని, తన ఫ్రెండ్ రజనీకాంత్ నటించిన దర్బార్ కూడా వస్తోందని, అన్ని చిత్రాలను విజయవంతం చేయాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు.