ఆ బిడ్డ అన్ని పొగడ్తలకు అర్హుడే: విజయశాంతి

05-01-2020 Sun 22:15
  • సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన విజయశాంతి
  • మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు విజయశాంతి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహేశ్ బాబును ఆకాశానికెత్తేశారు.

"ఆ బిడ్డ బంగారం. చూడ్డానికి ఎంతో క్యూట్ గా ఉంటాడు. పట్టుకుంటే కందిపోయేలా ఉంటాడు. 24 క్యారట్ గోల్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహేశ్ బాబు జెంటిల్మన్. అన్ని పొగడ్తలకు అర్హుడే. ఎంతో నిరాడంబరంగా ఉండే హీరో. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే మహేశ్ బాబు అంచెలంచెలుగా ఎదిగిన వైనం అద్భుతం. ఈ సినిమాలో కామెడీ, డ్యాన్స్ లో నమ్మశక్యం కాని విధంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు" అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

సూపర్ స్టార్ కృష్ణ సినిమా ద్వారా తాను తెలుగు తెరకు పరిచయం అయ్యానని, ఇప్పుడు ఆయన తనయుడు మహేశ్ బాబు సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మహేశ్ బాబు హీరోగానే కాకుండా సామాజిక సేవల్లోనూ ముందున్నారని, వందలమందికి హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం మామూలు విషయం కాదన్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి చెబుతూ, ఆయనతో తాను చేసిన సినిమాలన్నీ ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి హిట్టవ్వాలని ఆశీర్వదించేందుకు వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు అంటూ ప్రసంగించారు.