చిరంజీవి పాట హమ్ చేస్తూ వేదికపై రౌడీ అల్లుడు స్టెప్పేసిన అనిల్ రావిపూడి

05-01-2020 Sun 21:58
  • హైదరాబాదులో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
  • చిరంజీవే తనకు స్ఫూర్తి అని తెలిపిన అనిల్ రావిపూడి

సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని ప్రదర్శించాడు. వేదికపై మాట్లాడుతూ, తనలో మొట్టమొదట పుట్టిన కళ డ్యాన్స్ అని, అందుకు చిరంజీవి గారే స్ఫూర్తి అని వెల్లడించాడు. తాను దర్శకుడ్నయినా, మొదట తానో డ్యాన్సర్ నని చెప్పాడు. అంతేకాదు, చిరు నటించిన రౌడీ అల్లుడు చిత్రంలోని ఓ పాటను హమ్ చేస్తూ వేదికపై మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేశాడు. అనిల్ డ్యాన్స్ చేసిన విధానం చిరంజీవి ముఖంలో నవ్వులు పూయించింది.

ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అబ్బ నీ తియ్యనీ దెబ్బ పాటకు డ్యాన్స్ చేస్తే ఓ జామెట్రీ బాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారని, ఆ తర్వాత లవ్ మీ మై హీరో అనే పాటకు డ్యాన్స్ చేస్తే ఓ సబ్బు పెట్టె బహుమతిగా ఇచ్చారని వెల్లడించాడు. లవ్ మీ హీరో పాటలో దివ్యభారతి గారిని చిరంజీవి తన కాలిపై కూర్చోబెట్టుకుని వేసే స్టెప్పు తనకెంతో ఇష్టమని చెప్పడమే కాదు, ఆ పాటను హమ్ చేస్తూ ఓ స్టెప్పేసి చూపించాడు. అది చూసి చిరంజీవి చప్పట్లతో అభినందించారు.