NRC: ఎన్నార్సీని ఏ రాష్ట్రం వ్యతిరేకించినా చర్యలు తప్పవు: కేంద్రమంత్రి ఆర్కే సింగ్ హెచ్చరికలు

  • విశాఖ వచ్చిన కేంద్రమంత్రి
  • సహాయ నిరాకరణ చేసినా చర్యలుంటాయని వెల్లడి
  • సీఏఏతో ఎవరి పౌరసత్వం లాక్కోవడంలేదని స్పష్టీకరణ

దేశవ్యాప్తంగా ఎన్నార్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ లపై నిరసన ధ్వనులు వినిపిస్తున్న తరుణంలో కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన ఈ ఉదయం విశాఖపట్నం వచ్చారు. ఇక్కడి బీజేపీ ఆఫీసులో జన జాగరణ్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం బ్రోచర్ ను విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నార్సీని ఏ రాష్ట్రం వ్యతిరేకించినా, కేంద్రానికి సహాయనిరాకరణ చేసినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 2004లో కాంగ్రెస్ హయాంలోనే ఎన్నార్సీ బిల్లు ఆమోదం పొందిందని వెల్లడించారు.

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో మైనారిటీలకు రక్షణ కొరవడిందని, వారిని అక్కున చేర్చుకోవడానికే పౌరసత్వ సవరణ చట్టం తీసుకువచ్చామని చెప్పారు. సీఏఏ అంటే ఎవరి నుంచి పౌరసత్వాన్ని లాగేసుకోవడానికి ఉద్దేశించింది కాదని అన్నారు. పౌరసత్వం అంశం కేంద్రం పరిధిలోని విషయమని, అందువల్ల దీన్ని అమలు చేయడం రాష్ట్రాల కర్తవ్యం అని స్పష్టం చేశారు. ఎన్నార్సీపై కొన్ని రాజకీయ పక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

More Telugu News