Pakistan: అందమైన అమ్మాయిలే ఎరగా పాక్ హనీట్రాప్... మరో ముగ్గురు నేవీ ఉద్యోగుల అరెస్ట్!

  • నౌకాదళ సమాచారం చోరీ
  • ఇప్పటికే పలువురి అరెస్ట్
  • మరింత మందికి ప్రమేయం
  • దర్యాఫ్తును ముమ్మరం చేసిన ఎన్ఐఏ

అందమైన అమ్మాయిలను చూసి, వారిపై ముచ్చటపడి, లొంగిపోయి, భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను వెల్లడించారన్న అభియోగాలపై మరో ముగ్గురు నేవీ ఉద్యోగులను ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) అరెస్ట్ చేసింది. వీరు ముగ్గురూ విశాఖపట్నంలో నేవీ ఉద్యోగులుగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో మరికొందరు నేవీ సెయిలర్స్‌ కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఎన్‌ఐఏ బృందం దర్యాఫ్తును ముమ్మరం చేసింది.

ఫేస్ బుక్ ద్వారా నేవీ ఉద్యోగులకు అమ్మాయిలను పరిచయం చేసిన పాకిస్థాన్, వారి వద్దకు అమ్మాయిలను పంపి, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను తీసి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు దిగి, ఆపై నౌకాదళ సమాచారాన్ని వారి నుంచి తీసుకుని ఉగ్రవాదులకు అందించినట్టు ఇటీవల తేలింది. దీనిపై సమాచారాన్ని అందుకున్న నిఘా వర్గాలు దాదాపు నెల రోజుల పాటు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాయి.

'ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌' నిక్ నేమ్ తో ఈ ఆపరేషన్ సాగగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపై అధికారులు డిసెంబర్ లో ఏడుగురు ఇండియన్‌ నేవీ సెయిలర్స్‌ ను, ఓ హవాలా ఆపరేటర్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ హనీ ట్రాప్ లో మరికొందరు సెయిలర్స్ కూడా ఉన్నారని అనుమానిస్తున్న ఎన్ఐఏ, మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

More Telugu News