Donald Trump: బాగ్దాద్ లోని అమెరికా ఆస్తులపై బాంబుల వర్షం... ట్రంప్ సీరియస్!

  • సులేమాని హత్య తరువాత మారిన పరిస్థితి
  • యూఎస్ ఎంబసీ సమీపంలో పడ్డ రాకెట్లు
  • పారా మిలిటరీ కాన్వాయ్ పై దాడి
  • దీటైన బదులిస్తామని ట్రంప్ హెచ్చరిక

బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై రాకెట్ దాడిని చేసి, ఇరాన్ నిఘా విభాగాధిపతి సులేమానిని అమెరికా సైన్యం హతమార్చిన తరువాత, ఇరాక్, ఇరాన్ దేశాల్లోని యూఎస్ ఆస్తులు లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బాగ్దాద్ లోని అమెరికా ఎంబసీ, తదితర భవంతులున్న గ్రీన్ జోన్ పై బాంబుల వర్షం కురిసింది. యూఎస్ రాయబార కార్యాలయం సమీపంలోని ప్రాంతాన్ని రెండు క్షిపణులు తాకాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిన వివరాలు తెలియరాలేదు. పారా మిలిటరీ బలగాల కాన్వాయ్ పైనా వైమానిక దాడి జరిగింది.

ఇక ఈ దాడులకు తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోసారి దాడి చేస్తే, అత్యంత వేగంగా, గట్టిగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోమని ఆయన అన్నారు. ఇరాన్ లోని 52 ముఖ్యమైన ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని రాకెట్లను గురి పెట్టి ఉంచామని, ఇంకోసారి తమ ఆస్తులపై దాడి చేస్తే, వాటన్నింటినీ ఒకేసారి ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు.

More Telugu News