Team India: గువాహటిలో మా భద్రతకొచ్చే ముప్పేమీ లేదు: కోహ్లీ

  • రేపు శ్రీలంకతో తొలి టీ20లో తలపడనున్న టీమిండియా
  • జట్టుకు రక్షణ పరంగా ఇబ్బందులు లేవన్న కెప్టెన్
  • ఆందోళనలపై పూర్తిగా తెలుసుకుని మాట్లాడాల్సి ఉంటుంది

శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్‌కు సమాయత్తమైన టీమిండియా రేపు అసోం రాజధాని గువాహటి వేదికగా తొలి మ్యాచ్ అడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. సీఏఏ, ఎన్నార్సీ లపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జట్టుకు రక్షణ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని పేర్కొన్నాడు. తమ భద్రతకు వచ్చే ముప్పేమీ లేదని, గువాహటిని సురక్షిత నగరంగా భావిస్తున్నామని తెలిపాడు.

‘సీఏఏ, ఎన్నార్సీలపై చెలరేగుతున్న ఆందోళనలపై  నేను బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యానించదలుచుకోలేదు. రెండు వైపులా అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై నాకు పూర్తి సమాచారం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా అభిప్రాయం చెప్పడం సరైంది కాదు. గువాహటి సురక్షితమైన నగరమని తెలుసు. మాకు అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు’అని పేర్కొన్నాడు.  

సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా అసోంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో..  ఇప్పటివరకు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిరసనల్లో హింసకు పాల్పడ్డారంటూ 190 మందిని అరెస్టు చేశారు. దీంతో అసోంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మ్యాచ్ జరుగనున్న గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో అసోం క్రికెట్‌ అసోసియేషన్‌ భద్రతను కట్టుదిట్టం చేసింది. ప్రేక్షకులు కేవలం మొబైల్‌ ఫోన్లు, పర్సులు మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతినిచ్చినట్లు నిర్వాహకులు మీడియాకు తెలిపారు.    

More Telugu News