BP: బీపీ కారణంగానే శ్రీదేవి చనిపోయింది: బయోగ్రఫీ రచయిత సత్యార్థ్

  • అందరినీ విషాదంలోకి నెట్టిన శ్రీదేవి మరణం
  • దుబాయ్ లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మృతి!
  • శ్రీదేవికి లో-బీపీ ఉందంటున్న రచయిత

కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా, తాను అడుగుపెట్టిన ప్రతి భాషలోనూ అగ్రస్థానం పొందిన హీరోయిన్ శ్రీదేవి. అత్యంత విషాదకర పరిస్థితుల్లో శ్రీదేవి కన్నుమూయడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, ఆమె మృతిపై ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. బాత్ టబ్ లో పడి మరణించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నా, ఇప్పటికీ స్పష్టతలేదు. అయితే, శ్రీదేవి జీవితకథ రాసిన సత్యార్థ్ నాయక్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

శ్రీదేవికి లో-బీపీ ఉందని, ఆ కారణంగానే బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయారని తెలిపారు. శ్రీదేవి రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఆమె మేనకోడలు మహేశ్వరి కూడా నిర్ధారించిందని చెప్పారు. ఉదయపు నడక సందర్భంగానూ అనేకమార్లు శ్రీదేవి బీపీ కారణంగా పడిపోయినట్టు బోనీ కపూర్ సైతం చెప్పిన విషయాన్ని సత్యార్ధ్ ఉటంకించారు. అంతేకాదు, షూటింగుల్లోనూ అనేకసార్లు బీపీతో ఆమె బాధపడిన విషయాన్ని నాగార్జున, దర్శకుడు పంకజ్ పరాశర్ కూడా తెలిపినట్టు వివరించారు.

రెండేళ్ల కిందట శ్రీదేవి దుబాయ్ లో బంధువుల పెళ్లి కోసం వెళ్లి అక్కడే ఓ స్టార్ హోటల్ లో మరణించడం తెలిసిందే. బాత్ టబ్ లో విగతజీవిగా మారారు. శ్రీదేవి మరణం నుంచి ఇప్పటికీ ఆమె భర్త బోనీ కపూర్ కోలుకోలేదు. ఇటీవల తెలుగుగడ్డపై జరిగిన ఓ ఫంక్షన్ లో ఆమె ప్రస్తావన రాగానే కన్నీటి పర్యంతమై ఏమీ మాట్లాడలేకపోయారు.

More Telugu News