సంక్రాంతి సినిమాల రిలీజ్ తేదీలు ఇవే.... సమస్యను పరిష్కరించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్

04-01-2020 Sat 19:50
  • పెద్ద చిత్రాలకు రిలీజ్ డేట్ల సమస్య
  • ప్రొడ్యూసర్స్ గిల్డ్ ముందుకు చేరిన పంచాయితీ
  • సమస్య పరిష్కారమైందన్న దిల్ రాజు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్ ఓ సెంటిమెంట్ అని చెప్పాలి. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు సంక్రాంతి బరిలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తహతహలాడుతుంటాయి. అయితే, ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాల తేదీ విషయంలో నిర్మాణ సంస్థల మధ్య అవగాహన కుదరలేదు. ముఖ్యంగా, మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అల... వైకుంఠపురములో చిత్రం మధ్య రిలీజ్ డేట్ల గొడవ కొన్ని నెలల కిందటే మొదలైంది.

ఈ రెండు చిత్రాలను ఒకే రోజున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధపడ్డారు. అయితే ఓపెనింగ్స్ కోసం రాజీ పడ్డారు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల... వైకుంఠపురములో చిత్రం వస్తాయని ప్రకటించినా, కొన్నిరోజుల కిందట మళ్లీ వివాదం రేగింది. రిలీజ్ డేట్లు మారుతున్నాయంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఏటీఎఫ్ పీజీ) చొరవ తీసుకుని ఆయా నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చింది.

దాంతో సరిలేరు నీకెవ్వరు ఎప్పుట్లాగానే జనవరి 11న, అల... వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు అంగీకరించారు. దీనిపై నిర్మాతలు దామోదరప్రసాద్, దిల్ రాజు స్పందించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ చొరవతో సమస్య పరిష్కారం అయిందని, అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని, అందరం కలిసి చర్చించుకున్నామని తెలిపారు.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు ఇవే...

  • దర్బార్-జనవరి 9
  • సరిలేరు నీకెవ్వరు-జనవరి 11
  • అల... వైకుంఠపురములో-జనవరి 12
  • ఎంత మంచివాడవురా-జనవరి 15