Jagan: అది బోస్టన్ రిపోర్ట్ కాదు... జగన్ బోగస్ రిపోర్ట్: నారా లోకేశ్ విమర్శలు

  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన బీసీజీ
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • అంతా జగన్ రాసిన స్క్రిప్ట్ అన్న లోకేశ్

ఏపీ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సమర్పించిన నివేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అమరావతిని చంపేయాలన్న దుర్బుద్ధితో గత ఐదేళ్లలో జగన్ రాసిన స్క్రిప్ట్ కు, బీసీజీ నివేదికకు తేడా ఏమీ లేదని తెలిపారు. అది బోస్టన్ రిపోర్ట్ కాదని, జగన్ బోగస్ రిపోర్ట్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలనే జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికల్లో పొందుపరిచారని, వీటి విశ్వసనీయత ఏపాటిదో కోర్టుల ముందు తేలిపోతుందని పేర్కొన్నారు. కన్సల్టింగ్ కంపెనీలను ముంచడం జగన్ కు అలవాటేనని లోకేశ్ ట్వీట్ చేశారు.

పెద్ద నగరాల శివార్లలో అభివృద్ధి చేసిన శాటిలైట్ టౌన్ షిప్ లు, టెక్నాలజీ హబ్ లను గ్రీన్ సిటీలుగా చూపించి అవన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారని, దాన్నిబట్టే ఈ బీసీజీ రిపోర్ట్ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తమ రిపోర్టులో అన్ని నగరాల గురించి చెప్పిన బీసీజీ సభ్యులు ఏడాదికి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న సైబరాబాద్ గురించి ఎందుకు చెప్పలేదని లోకేశ్ ప్రశ్నించారు.

రాజధాని ఏర్పాటుకు అమరావతి అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతం అని శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిందని, అయితే, అమరావతి ముంపు ప్రాంతమని, నేల తీరు కారణంగా ఇక్కడ నిర్మాణ వ్యయం పెరుగుతుందని ఆరోపణలు చేసి కోర్టుతో మొట్టికాయలు తిన్నారని ఎద్దేవా చేశారు. అయినా జగన్ దుష్టబుద్ధి మారలేదని విమర్శించారు. కోర్టు చివాట్లు పెట్టిన అంశాలనే మళ్లీ రిపోర్టులో పెట్టడం ద్వారా అది బోగస్ రిపోర్ట్ అని జగన్ గారే స్వయంగా ప్రకటించారని వ్యంగ్యంగా అన్నారు. 

More Telugu News