Rohingya: ఇక రోహింగ్యా ముస్లింల పని పడతాం.. దేశం నుంచి వెళ్లగొడతాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

  • రోహింగ్యాల జాబితా రెడీ అవుతోంది
  • ఒక్కరికి కూడా పౌరసత్వం లభించే అవకాశం లేదు
  • వీరంతా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందే

మన దేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యా ముస్లింల పనిపడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయిన రోజునే జమ్ముకశ్మీర్ లో దాన్ని అమలు చేయడం ప్రారంభించామని చెప్పారు. జమ్ముకశ్మీర్ లో అధికారులకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లో రోహింగ్యాల జనాభా ఎక్కువగా ఉందని చెప్పారు. బెంగాల్ నుంచి వివిధ రాష్ట్రాలను దాటుకుని వారు ఇక్కడకు చేరుకున్నారని అన్నారు.

భారత్ లో భారీ సంఖ్యలో రోహింగ్యాలు ఉండటం ఆందోళనకరమని చెప్పిన జితేంద్ర సింగ్... వారి జాబితా రెడీ అవుతోందని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఒక్క రోహింగ్యాకు కూడా పౌరసత్వం లభించదని చెప్పారు. సీఏఏ ద్వారా ఆరు మతాల మైనార్టీలకు మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుందని... వీరిలో రోహింగ్యా ముస్లింలకు చోటు లేదని తెలిపారు. అంతేకాదు వీరు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లకు చెందినవారు కూడా కాదని చెప్పారు. మయన్మార్ నుంచి వారు వలస వచ్చి మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపారు. వీరంతా మన దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనని చెప్పారు.

ప్రభుత్వ డేటా ప్రకారం 13,700 మంది విదేశీయులు (రోహింగ్యాలు, బంగ్లాదేశీలు) జమ్ము, సాంబా జిల్లాలలో స్థిరపడ్డారు. 2008-2016 మధ్య కాలంలో వీరి జనాభా మరో 6 వేలు పెరిగింది. దీనిపై జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, బెంగాల్ నుంచి ఇన్ని రాష్ట్రాలు దాటుకుని జమ్మూకశ్మీర్ కు వీరు ఎలా వచ్చారో విచారణ జరపాల్సి వుందని అన్నారు. రీసెర్చర్లు, అనలిస్టులు కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాలని అన్నారు. ఇన్ని రాష్ట్రాలు దాటుకుని రావడానికి వీరికి టికెట్లు ఎవరు కొనిచ్చారని ప్రశ్నించారు. జమ్ములో రోహింగ్యాలు స్థిరపడటం వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలను మంత్రి వ్యక్తం చేశారు.

More Telugu News