Jagan: కర్ణాటకలో లోయలో పడిన కదిరి విద్యార్థుల బస్సు.. సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశాలు

  • విహారయాత్రకు వెళ్లిన కదిరి విద్యార్థులు
  • కర్ణాటకలోని జోగ్ జలపాతం వద్ద లోయలో పడిపోయిన బస్సు
  • తక్షణమే సహాయక చర్యలు చేబట్టాలని ఆదేశించిన జగన్

అనంతపురం జిల్లా కదిరి నుంచి విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు కర్ణాటకలోని దార్వాడ్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. జోగ్ జలపాతం వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందగా... ఇద్దరు ఉపాధ్యాయులు, ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన తర్వాత బస్సు అద్దాలను పగులగొట్టి విద్యార్థులు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు వచ్చి, క్షతగాత్రులను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతూ బాబా మక్సుద్దీన్ అనే విద్యార్థి మృతి చెందాడు.

 బస్సు ప్రమాదం నేపథ్యంలో హెడ్మాస్టర్ కు గుండెపోటు వచ్చింది. సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కొడుకు ఇక లేడని తెలుసుకుని మక్సుద్దీన్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీసీన సీఎం... జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలను అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. విద్యార్థులంతా క్షేమంగా తిరిగి రావడానికి ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

More Telugu News