CAA: సీఏఏను బీజేపీ సీఎంలే ఒప్పుకోవడంలేదు: కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా

  • అసోం సీఎం సోనోవాల్ అంగీకరించడంలేదు
  • సాక్ష్యం ఇదిగో.. అంటూ సోనోవాల్ వ్యాఖ్యలు ట్వీట్
  • ప్రతిపక్షాలను మోదీ ప్రభుత్వం తప్పుబడుతోంది

బీజేపీ, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను అంగీకరించడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతిపక్షాలను మోదీ ప్రభుత్వం తప్పుబడుతోందని ఆయన విమర్శించారు.  తన రాష్ట్రంలో విదేశీయులు నివసించడానికి అనుమతించబోనని అసోం సీఎం శర్బానంద సోనోవాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సూర్జేవాలా ప్రస్తావిస్తూ..  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఈ విషయాన్ని తొలుత గుర్తెరగాలని చురకలంటిస్తూ.. ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా సీఏఏను అమలు చేసేందుకు అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ సిద్ధంగా లేరని పేర్కొంటూ.. ఆయన చేసిన ట్వీట్ ను  కూడా జతచేశారు. ‘ప్రధాని గారు, దేశాన్ని మభ్యపెట్టడం మానండి. మీ సొంత సీఎం బహిరంగంగా సీఏఏను అమలు చేయనంటున్నారు. ఆయనను మీరు దేశ వ్యతిరేకిగా ప్రకటిస్తారా? ప్రతిపక్షాలను విమర్శించే ముందు ఆయనను డిస్ మిస్ చేయండి’ అని ట్విట్టర్ సందేశంలో సూర్జేవాలా డిమాండ్ చేశారు.

More Telugu News