Jagan: దేశంలో జగన్ కు ఎక్కడా సొంతిల్లు లేదు.. ఏదీ ఆయన పేరు మీద లేదు: వర్ల రామయ్య

  • వర్ల రామయ్య మీడియా సమావేశం
  • ఏసీబీ అధికారులను జగన్ మందలించడం సిగ్గుచేటన్న వర్ల
  • అధికారులకు హితవు

ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ వంటి వాళ్లు సీఎంలు అవుతారని ఊహించి ఉంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడో ఓ చోట ఇలాంటి వాళ్లకు అడ్డుకట్ట వేసేవారని వ్యాఖ్యానించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఏసీబీ అధికారులను మందలించడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు. ప్రజల సొమ్మును బినామీ ఇంటికి ఖర్చుచేసిన జగన్ నీతులు చెబుతున్నాడని, ఆ నీతివాక్యాలను ప్రజలంతా వినాల్సిన దౌర్భాగ్యం పట్టిందని పేర్కొన్నారు.

తాడేపల్లిలో జగన్ ఉంటున్న నివాసం ఓ బినామీ పేరు మీద ఉందని, దేశంలో జగన్ కు ఎక్కడా సొంత ఇల్లు లేదని వెల్లడించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసం, తాడేపల్లి ఇల్లు, ఇడుపులపాయ ఎస్టేట్, బెంగళూరులోని వైట్ హౌస్ ఏదీ జగన్ పేరు మీద లేవని తెలిపారు. ఇవన్నీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే తెలుస్తుందని అన్నారు. అంతేకాకుండా, ఏపీ అధికారులకు కూడా వర్ల రామయ్య హితవు పలికారు. జగన్ చెప్పిన ప్రతివిషయానికి వెనుకాముందు ఆలోచించకుండా తలలూపుతున్నారని, ఎగిరెగిరి సంతకాలు పెడుతున్నారని విమర్శించారు. కానీ అధికారులను జైలుకు పంపడం జగన్ కు అలవాటేనని, గతంలో శ్రీలక్ష్మి, బ్రహ్మానందరెడ్డి, వీబీ ఆచార్య, రాజగోపాల్ వంటి అధికారుల పరిస్థితి ఏమైందో గుర్తెరగాలని హితవు పలికారు.

More Telugu News