Maharashtra: మహారాష్ట్ర మంత్రుల్లో 27 మందిపై క్రిమినల్ కేసులు!

  • 18 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు
  • 42 మంత్రుల్లో 41 మంది మంత్రులు కోటీశ్వరులు
  • మంత్రివర్గంలో కేవలం ముగ్గురే మహిళా మంత్రులు

మహారాష్ట్రలో కొలువుదీరిన ప్రభుత్వంలో 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్(ఆడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్) తన అధ్యయన నివేదికలో తెలిపింది. ఈ మంత్రుల్లో 18 మందిపై తీవ్రమైన కేసులున్నాయని పేర్కొంది. ఎన్నికల సందర్భంగా వీరు ఈసీకి సమర్పించిన అఫిడవిట్లలో తెలిపిన వివరాలను పరిశీలించిన ఏడీఆర్ నేర చరిత గలిగిన అభ్యర్థుల జాబితాతోపాటు ఇతర జాబితాలను రూపొందించింది.

శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీ పేర ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో  42 మంత్రుల్లో 41 మంది మంత్రులు కోటీశ్వరులను నివేదిక తెలిపింది. మంత్రివర్గంలో కేవలం ముగ్గురే మహిళా మంత్రులున్నారని పేర్కొంది. విద్య విషయానికి వస్తే.. 22 మంది మంత్రులు గ్రాడ్యుయేట్లని, 18 మంది మంత్రులు 8 నుంచి 12వ తరగతి మాత్రమే చదివారని స్పష్టం చేసింది. కాగా, 17 మంది మంత్రులు  25 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారని, 25 మంది మంత్రుల వయసు 50 నుంచి 80 ఏళ్ల లోపు ఉంటుందని నివేదిక వెల్లడించింది.

More Telugu News