CAA: సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో వృద్ధ మహిళల నిరసన!

  • ఎముకలు కొరికే చలిని తట్టుకుంటూ 15 రోజులుగా..
  • ఢిల్లీలోని షహీన్ బాఘ్ ప్రాంతంలో ధర్నా  
  • పూర్తి పేర్లు చెబితే జాబితాలోంచి తొలగిస్తారన్న వృద్ధులు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ముగ్గురు వృద్ధ మహిళలు ఢిల్లీలో గత పదిహేను రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అసలే చలికాలం.. అదీ ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువ. అయినా అటువంటి చలిని సైతం లెక్కచేయకుండా ఆస్మా ఖటూన్ (90), బిల్కీస్(82), శార్వరి(75) ఢిల్లీలోని షహీన్ బాఘ్ ప్రాంతంలో నిరసన తెలుపుతున్నారు. అధికారులు వచ్చి 'మీ పూర్తి పేర్లేంటి?' అని అడిగినా వారు చెప్పటం లేదు. 'మా పేర్లు చెబితే మీరు మా పేర్లు తొలగిస్తారు’ అని ఆ వృద్ధ మహిళలు ముక్తకంఠంతో జవాబిస్తున్నారు.

వీరి నిరసనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ఆదరణను విశేషంగా చూరగొంటోంది. సీఏఏపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సీఏఏపై వెనక్కి తగ్గేది లేదని పేర్కొంటోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అమిత్ షా ఇదే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పారు. ఈ చట్టం మైనారిటీలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News