Chandrababu: ఎక్కడ చదివాడో కానీ ఆ చదువంతా మనపై ప్రయోగిస్తున్నాడు: జగన్ పై చంద్రబాబు ఫైర్

  • సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు
  • రాజధాని అంశంపై వ్యాఖ్యలు
  • ఎందుకు ఓ కులాన్నే ఎత్తిచూపుతున్నారంటూ ఆగ్రహం

రాజధాని అమరావతి అట్టుడుకుతున్న నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మంగళగిరిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి, యువజన సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఐదేళ్లు పాలించినా ఒక్కసారి కూడా విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఆలస్యం చేయలేదని అన్నారు. సకాలంలో ఉపకార వేతనాలు అందించి ఎవరూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా చేశామని చెప్పారు.

"ఇవాళ మీరు రోడ్డెక్కితే మీమీదే లాఠీచార్జి చేస్తున్నారు. ఇది ఎంతో దుర్మార్గమైన పరిస్థితి. ఇక్కడ వేదిక మీద ఎంతోమందిమి కూర్చున్నాం. ఓ కులం వాళ్లమే కూర్చున్నామా? ఈ ప్రాంతంలో ఒకే కులం వాళ్లు ఉన్నారా? విజయవాడ, గుంటూరులో ఒకే కులం ఉందా లేక ఒకే మతం ఉందా. ఎందుకు మీరు కులం ప్రస్తావన తీసుకువస్తున్నారు. ఈ ప్రాంతం మునిగిపోతుందని అంటున్నారు. ఎప్పుడైనా ఇక్కడ ముంపు వచ్చిందా. ఫౌండేషన్ వీక్ అని అంటున్నారు. నిన్నామొన్నా తప్పుడు సమాచారం తీసుకువచ్చి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు.

ఎక్కడైనా ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే స్టాక్ ఎక్చేంజీలో వస్తుంది. వ్యాపారాల్లో ఏదైనా కంపెనీలో డైరెక్టర్లు ముందస్తు సమాచారం లీక్ చేసినప్పుడు ఎవరైనా ముందుగా షేర్లు కొని లాభపడితే దాన్ని ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. ముఖ్యమంత్రి ఇల్లే కట్టుకున్నాడు.. అది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదా? బినామీలంటారు, సీఎం ఇల్లు ఎవరి పేరు మీద కట్టారో ఆయనకే తెలియదు. నాకు డాక్యుమెంట్లు చూపించగలరా? ఆ ఇంటికి రూ.42 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేస్తున్నారు. అతనేం చేసినా న్యాయం, చట్టం, ధర్మం. మనమేం చేసినా అధర్మం, అన్యాయం!

ఇలాంటి పరిస్థితులు మన ఉనికికే ప్రమాదం, అభివృద్ధికి విఘాతం. రాజధాని విశాఖలో ఏర్పాటు చేస్తే కర్నూలు, మంత్రాలయం, కుప్పం నుంచి ప్రజలు వెళ్లగలరా? పొరుగు రాష్ట్రాల నగరాలకు కూడా తాము వెళ్లగలుగుతున్నాం కానీ, ఈ రాజధాని మాకు దూరమెక్కువ అని అనంతపురం ప్రజలంటున్నారు. దేనికోసం మేం అంత కష్టపడాలని అడుగుతున్నారు.

రాజధానిలో ఎవరికి పనుంటుంది అంటారు. ఓ సామాన్యుడికి పనుంటుంది. ఏదైనా కేసులో కోర్టు ఆర్డర్ పొందిన సామాన్యుడు అక్కడి నుంచి విశాఖ వెళ్లి సచివాలయంలో ఆమోదం పొంది, ఆపై మళ్లీ అమరావతి వచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ తో ఆమోద ముద్ర వేయించుకుని, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ వెళితే అక్కడినుంచి ఎమ్మార్వో వద్దకు వెళ్లాలి. సామాన్యుడు ఇంత కష్టపడాలా? ఇలాంటి విషయాలు చదువుకోని వాళ్లకు అర్థం కాకపోవచ్చు. కానీ రేపు ఎవరికైనా అనుభవంలో వస్తే తెలుస్తుంది ఎంత కష్టమో!

1000 కిలోమీటర్లు 18 గంటల ప్రయాణం. అక్కడ ఎక్కడ బస చేయాలో తెలియదు. మంత్రులు, అధికారులు అందరూ ఒకే దగ్గర ఉండాలని మేం భావించాం. కానీ ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటారంట! మరి ఆయన ఎక్కడ చదువుకొని వచ్చాడో నాకైతే తెలియదు. నేను ఎక్కడ చదువుకున్నానో ఆ యూనివర్శిటీ పేరైనా చెప్పగలను. కానీ ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఆ పేరు కూడా చెప్పలేడు. ఎక్కడ చదివాడో కానీ ఆ చదువంతా మనపై ప్రయోగిస్తున్నాడు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి.

ఇది ఒకరోజుతో పోయేది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఐదు కోట్ల మంది ప్రజలకు చెందిన సమస్య. చట్ట వ్యతిరేకం, చట్ట ఉల్లంఘన. రాజధానిని మార్చే అధికారం కూడా లేదు. నా 40 ఏళ్ల అనుభవంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, ఇలాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. ఈయన్ని ఎలా అభివర్ణించాలో అర్థం కావడంలేదు. అది అదృష్టమా, దురదృష్టమా, రాష్ట్రానికి పట్టిన గ్రహణమా అనేది కాలమే నిర్ణయించాలి అంటూ వ్యాఖ్యానించారు.

ఈ మహానుభావుడి పుణ్యమా అని విజయవాడ, విశాఖ ఫ్లయిట్ సర్వీసులు కూడా వెనక్కిపోయాయని, కనీసం కర్నూలుకు ఓ ఫ్లయిట్ వేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. "యువత భవిష్యత్తు కోసం హెచ్ సీఎల్ అధినేత శివనాడార్ ను స్వయంగా హోటల్ కు వెళ్లి కలిసి, ఆయన్ను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి విమానం ఎక్కించి వచ్చాను. ఎవరికోసం వెళ్లాను, నేనేమైనా ఉద్యోగం అడుగుతానా ఆయన్ని? యువత ఉద్యోగాల కోసం వెళ్లాను. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వస్తే డిన్నర్ ఇచ్చి పెట్టుబడుల కోసం ప్రయత్నించాం. కియా మోటార్స్ కోసం కొరియా వెళ్లాను. సింగపూర్ వంటి దేశాన్ని సీడ్ క్యాపిటల్ లో భాగస్వామిని చేసి భూమి విలువ పెంచేందుకు ప్రయత్నిస్నే దాన్ని కూడా పంపించివేశారు " అంటూ వివరించారు.

More Telugu News