Jagan: ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్ కు సీబీఐ కోర్టు ఆదేశం

  • అక్రమాస్తుల కేసులో జగన్ పై ఆరోపణలు
  • ఇవాళ కోర్టులో హాజరు కావాల్సి ఉన్న జగన్, విజయసాయిరెడ్డి
  • వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా అనుమతినిచ్చిన కోర్టు

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని హైదరాబాదు, నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాదికి సూచించింది. అదేవిధంగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.

ఈ కేసు విచారణ నిమిత్తం ఇవాళ కోర్టులో జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి ఈరోజు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరడంతో అందుకు అంగీకరించింది.

సీఎం అయిన తర్వాత అధికారిక కార్యక్రమాలతో తాను బిజీగా ఉంటున్నానని, వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ తన తరఫు న్యాయవాది ద్వారా గైర్హాజర్ పిటిషన్ దాఖలు చేయిస్తున్నారు. ప్రతి శుక్రవారం జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునకు అనుతినిస్తున్న సీబీఐ కోర్టు ఈసారి మాత్రం కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ఇప్పటి వరకూ చాలా సార్లు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు ఇచ్చామని, అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

More Telugu News