Amit Shah: సీఏఏపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. దమ్ముంటే చర్చకు రండి: అమిత్ షా

  • పౌరసత్వ చట్టం మైనార్టీలకు వ్యతిరేకం కాదు
  • కాంగ్రెస్ పార్టీ యువతను తప్పుదోవ పట్టిస్తోంది
  • ఎంత రాద్ధాంతం చేసినా పట్టించుకోము

పౌరసత్వ సవరణ చట్టం మైనార్టీలకు వ్యతిరేకం కాదని... ఆ చట్టాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జోధ్ పూర్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, మమతా బెనర్జీ పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని... తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారికి సవాల్ విసురుతున్నానని... దమ్ముంటే ముందుకు వచ్చి తనతో చర్చించాలని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ వారికి దమ్ము లేకపోతే... ఇటాలియన్ భాషలోకి అనువదించి ఇస్తానని, దాన్ని చదువుకోవాలని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని... దీంతో, వారు రోడ్లపైకి వచ్చేలా చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంత రాద్ధాంతం చేసినా తాము పట్టించుకోబోమని... మైనార్టీలు, యువతకు చేరువ కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు.

మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధికులు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు కావడం గమనార్హం.

More Telugu News