Iran: ఇరాన్ కమాండర్ ను హతం చేసిన తర్వాత ఇరాకీల డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన అమెరికా

  • బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై అమెరికా దాడి
  • ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ సోలెమన్ హతం
  • రోడ్లపై పరుగెడుతూ హర్షం వ్యక్తం చేసిన ఇరాక్ ప్రజలు

ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ జనరల్ ఖాసిం సోలెమన్ ను అమెరికా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై జరిపిన రాకెట్ దాడుల్లో సోలెమన్ తో పాటు మరికొందరు ఉన్నత స్థాయి కమాండర్లు హతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడిని చేసినట్టు ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్ ప్రకటించింది.

మరోవైపు, సోలేమన్ ను హతమార్చిన అనంతరం వీధుల్లో ఇరాక్ ప్రజలు డ్యాన్స్ చేస్తున్న వీడియోను అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ట్విట్టర్ లో షేర్ చేశారు. 'స్వాతంత్ర్యం కోసం ఇరాకీలు డ్యాన్స్ చేస్తున్నారు. జనరల్ సోలేమన్ ఇక లేడన్న వార్త సంతోషకరం' అని ట్వీట్ చేశారు. పాంపియో షేర్ చేసిన వీడియోలో జాతీయ జెండాలు, బ్యానర్లను చేతపట్టి రోడ్లపై ఇరాక్ ప్రజలు పరుగెత్తుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారన్న వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

మరోవైపు దాడులపై అమెరికా రక్షణ శాఖ స్పందిస్తూ, ఇరాక్ లో ఉన్న తమ అధికారులు, సర్వీస్ మెంబర్లపై దాడులకు సోలేమన్ వ్యూహరచన చేస్తున్నాడని తెలిపింది. వందలాది అమెరికా, సంకీర్ణ బలగాల మరణాలకు, వేలాది మంది గాయపడటానికి ఆయన కారణమని వెల్లడించింది.

More Telugu News