18 years back missing: ఊహ తెలియని సమయంలో తల్లిదండ్రులకు దూరం...పద్దెనిమిదేళ్ల తర్వాత వారి చెంతకు!

  • అమ్మానాన్నలను కలుసుకున్న యువతి 
  • బాల్యంలో ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తి 
  • అనాథాశ్రమంలో పెరిగి పెద్దదైన వైనం

ఊహ కూడ తెలియని వయసులో ఓ ఆగంతుకుడి చర్య కారణంగా అమ్మానాన్నలకు దూరమైన ఆ బాలిక దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది. అనాథాశ్రమంలో పెరిగి పెళ్లి చేసుకుని గర్భిణిగా తమ వద్దకు వచ్చిన కుమార్తెను చూసి ఆ తల్లిదండ్రులు ఆనందబాష్పాలు రాల్చారు. 

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన మంగతాయారు, వెంకటరత్నంల ఏకైక కుమార్తె ప్రసన్న. 2002లో ఆమె బాల్యంలో ఉండగా తల్లిదండ్రులు భీమడోలులోని ఆలయానికి తీసుకువెళ్లారు. ప్రసన్న తల్లిదండ్రులు ఏమరుపాటుగా ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలికను అపహరించి విశాఖ తీసుకువెళ్లిపోయాడు. కొన్నాళ్లు పెంచుకుని అనంతరం అనాథాశ్రమంలో వదిలేశాడు. ఆ సమయంలో వీరవాసరం, అనంతపల్లి అనే రెండు చిరునామాలు ఇచ్చాడు.

అనాథాశ్రమంలో ఉంటూ ఇంటర్ వరకు చదువుకున్న ప్రసన్న అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడే నరేందర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రసన్న ఏడు నెలల గర్భిణి. తల్లిదండ్రుల కోసం ప్రసన్న అనుభవిస్తున్న మనోవేదనను గుర్తించిన ఆమె భర్త నరేందర్ ఎలాగైనా ఆమెను పుట్టింటికి చేర్చాలని భావించారు.

ఇందుకోసం అనాథాశ్రమంలో లభించిన చిరునామాల ఆధారంగా ప్రసన్న తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాడు. తొలుత విశాఖ, అక్కడి నుంచి వీరవాసరం, అనంతపల్లికి వెళ్లాడు. అనంతపల్లి గ్రామస్థులు తెలిపిన వివరాలతో ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పాడు.

వారు గుర్తించడంతో భార్యను వారి చెంతకు చేర్చాడు. పద్దెనిమిదేళ్ల క్రితం తప్పిపోయి, ఇక దొరకదనుకున్న కుమార్తె ఇన్నాళ్లకు తమ చెంతకు చేరడంతో వారు ఆనందపరవశులయ్యారు.

More Telugu News