BJP: 2019 బీజేపీకి కలిసి వచ్చింది: పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్

  • తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవిస్తుంది
  • సీఏఏను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మత విద్వేషాలు రేపుతోంది
  • సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది  
  • ఎన్పీఆర్ చేస్తే కేసీఆర్ తప్పన్నట్లుగా చూస్తున్నారు

2019 సంవత్సరం దేశ వ్యాప్తంగా బీజేపీకి కలిసి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 2020 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 సంవత్సరం తమ పార్టీకి కలిసివచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ సాధించి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెప్పారు.

అదే సమయంలో ఉత్తర తెలంగాణలో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచి పార్టీ బలపడిందని చెప్పారు. రానున్న కాలంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఆవిర్భవిస్తుందన్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఒప్పు.. అదే బీజేపీ చేస్తే తప్పా? అంటూ ప్రశ్నించారు. ఎన్పీఆర్ చేస్తే తప్పన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం ఇవన్నీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు.

‘2020 సంవత్సరం’ను పోరాటాలు, ఉద్యమాల సంవత్సరంగా పరిగణిస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో తమ పార్టీ పోటీకి దిగుతుందన్నారు. ఈ నెల 7న ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులుతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు బీజేపీలో చేరుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని పేర్కొన్నారు. దేశంలో కాంగ్రెస్ కనుమరుగైందన్నారు. సీఏఏను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ మత విద్వేషాలు రేపుతోందని ఆరోపించారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారన్నారు.

More Telugu News