Murali Mohan: చిన్న చిన్న అభిప్రాయ భేదాలే... సరిచేశాం: మురళీమోహన్

  • రాజశేఖర్ అవేశపరుడని అందరికీ తెలుసు
  • సీనియర్ నటులకు గౌరవం లేదన్నది ఆరోపణలే
  • చిరంజీవి క్యాప్షన్ అద్భుతం

నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన నేపథ్యంలో సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. కార్యక్రమంలో తలెత్తినవి చిన్న చిన్న అభిప్రాయ భేదాలే అని చెప్పారు. రాజశేఖర్ ఆవేశపరుడని, ఈ విషయం అందిరికీ తెలుసని అన్నారు. క్రమ శిక్షణ కమిటీ వేయనున్నామని అదే వాటిని పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.

‘కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మా అసోసియేషన్ లో తలెత్తిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలను సరిచేయాలన్న ఉద్దేశంతోనే భారీ స్థాయిలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టాం. కార్యవర్గం కూడా బాగుంది. మన చేతికున్న ఐదు వేళ్లు ఒకేలాగా ఉండవు. కానీ, అన్నీ కలిస్తే పిడికిలి అవుతుంది. ఏదైనా సాధించగలం. అంతేకానీ వేరే గొడవలు ఏవీ లేవు. రాజశేఖర్ కాస్త ఆవేశపరుడు. అది అందరికీ తెలుసు. ఆవేశంలో మాట్లాడతాడు, ఆ తర్వాత ఏమీ ఉండదు. సీనియర్ నటులకు గౌరవం లేదన్నది కేవలం ఆరోపణ మాత్రమే.

ప్రతి కుటుంబంలో అన్నదమ్ములు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు సహజం. చిరంజీవి మంచి ఉంటే మైకులో మాట్లాడుకుందాం.. చెడు ఉంటే చెవిలో మాట్లాడుదాం అన్న మాట అద్భుతం. ఈ క్యాప్షన్ ను మా అసోసియేషన్ ప్రధాన ద్వారం వద్ద పెట్టనున్నాం. చిన్నచిన్న అభిప్రాయ భేదాలుంటాయి. వాటిని సరిచేశాం. ఒకవేళ సమస్యలు ఏవైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. రాజశేఖర్ పై చర్య తీసుకుంటామా? లేదా? అన్నది కమిటీ వేసిన తర్వాత నిర్ణయిస్తాం’ అని అన్నారు.

More Telugu News