ఇండియాలో తొలిసారి... జాతీయత నిరూపించుకోవాలంటూ, అక్కా చెల్లెళ్లకు పాస్ పోర్ట్ నిరాకరణ!

02-01-2020 Thu 11:19
  • హర్యానాలోని అంబాలాలో ఘటన
  • నేపాలీల్లా కనిపిస్తున్నారన్న పోలీసులు
  • కల్పించుకున్న కేంద్ర మంత్రి అనిల్ విజ్

దేశవ్యాప్తంగా జనగణన, పౌర జాబితా తదితర అంశాలపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, హర్యానాలో ఇద్దరు అమ్మాయిలు, తమ జాతీయతను నిరూపించుకోవాలంటూ, పాస్ పోర్ట్ ను నిరాకరించడం మరో వివాదాన్ని రాజేసింది. వీరిద్దరూ నేపాలీ అమ్మాయిల మాదిరిగా ఉన్నారన్నది అధికారుల ఆరోపణగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే, హర్యానా రాష్ట్రంలోని అంబాలా ప్రాంతానికి చెందిన భగత్ బహదూర్, తన ఇద్దరు కుమార్తెలు సంతోష్, హెన్నాలకు పాస్‌ పోర్టు కోసం దరఖాస్తు చేయించారు. పోలీసుల వెరిఫికేషన్ కూడా ప్రారంభమైంది. వీరిద్దరూ నేపాలీల్లా కనిపిస్తున్నారన్న కారణాన్ని చూపిస్తూ, జాతీయతను నిరూపించుకోవాలని చెప్పిన అంబాలా పోలీసు డిప్యూటీ కమిషనర్ అశోక్ వర్మ, ఇద్దరికీ పాస్‌ పోర్టు జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో వారిద్దరూ తొలుత పాస్ట్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లి, ఆపై కేంద్ర మంత్రి అనిల్ విజ్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఘటనపై స్పందించిన అనిల్ విజ్, వీరికి పాస్‌ పోర్టు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, దర్యాప్తు అనంతరం శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.