vijayashanti: 'సరిలేరు నీకెవ్వరు'లో రైలు ఎపిసోడ్ పడీ పడీ నవ్వేలా చేస్తుంది... అంతకుమించి ఇంకేమీ అడగొద్దు: విజయశాంతి

  • 13 సంవత్సరాల తరువాత నటిస్తున్న విజయశాంతి
  • సినిమాకు డబ్బింగ్ పూర్తి చేశాను
  • సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది
  • మహేశ్ బాబు కామెడీ టైమింగ్ సూపర్బ్

దాదాపు 13 సంవత్సరాల తరువాత మేకప్ వేసుకుని, మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

ఈ సినిమా డబ్బింగ్ ను తాను పూర్తి చేశానని, సినిమాలో రైలు ఎపిసోడ్ ను చూసి పడీ పడీ నవ్వానని అన్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత తనలోని ఒత్తిడి నుంచి రిలీఫ్ ను పొందినట్టు అనిపించిందని చెప్పారు. రష్మిక, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చాలా బాగా చేశారని, సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

సినిమాలో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని, ఈ పాత్రను మహేశ్ బాబు మరో స్థాయికి తీసుకెళ్లారని కితాబిచ్చారు. 1988లో మహేశ్ తో కలిసి 'కొడుకు దిద్దిన కాపురం'లో నటించానని, నాటి చిన్న పిల్లాడితో, మళ్లీ కలుస్తానని అనుకోలేదని విజయశాంతి వ్యాఖ్యానించారు.

 అప్పట్లో బాబును తాను చూసుకున్నానని, ఇప్పుడు మహేశ్ అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా తనను చూసుకున్నారని, పెద్దలంటే ఎంతో గౌరవాన్ని మర్యాదనూ చూపించారని కొనియాడారు. ఈ సినిమాలో తమ కాంబినేషన్ లో యాక్షన్, ఎమోషన్ సీన్లు అధికంగా ఉంటాయని ఆమె అన్నారు.

'ఎఎఫ్2' సినిమా సమయంలో ఈ కథను అనిల్ రావిపూడి చెప్పగా, నచ్చి నటించానని చెప్పిన విజయశాంతి, అంతకుముందు 'రాజా దీ గ్రేట్' సినిమాలో నటించాలని కూడా కోరారని, అప్పట్లో సమయం లేక నటించలేకపోయానని అన్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర పేరు భారతి అని గుర్తు చేసిన విజయశాంతి, 'ప్రతిఘటన' చిత్రంలోని భారతి పాత్రకు, ఈ పాత్రకు సంబంధం ఉండదని అన్నారు. చాలా హుందాగా పాత్ర సాగుతుందని, వెండితెరపై చూస్తే తెలుస్తుందని, 13 సంవత్సరాల తరువాత తన రీ ఎంట్రీకి ఇది సరైన చిత్రమన్న నమ్మకం ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

More Telugu News