special trains: సంక్రాంతి స్పెషల్: సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు!

  • ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే 
  • పండుగ రద్దీని అధిగమించేందుకు నిర్ణయం 
  • జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అందుబాటులోకి

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన ఏపీ వారికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రయాణ ఏర్పాట్లే పెద్ద సమస్య. వృత్తి ఉద్యోగాల కారణంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండుగ రోజుకి సొంతూరు చేరుకోవాలని తహతహలాడుతారు. ఆ మూడు రోజులు పుట్టిన ఊర్లోనో, బంధువుల ఇంట్లోనో గడిపి ఏడాదికి సరిపడే ఆనందానుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటారు.

కానీ, ఆ రోజుల్లో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ ధరలు రెండుమూడు రెట్లు పెంచి సొమ్ము చేసుకుంటాయి. కుటుంబం అంతా కలిసి వెళ్లాలంటే రవాణా చార్జీలే వేలకు వేలు అవుతాయని తెలిసి చాలామంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. ఈసారి అటువంటి సమస్య లేకుండా దక్షిణ మధ్య రైల్వే ఊరటనిచ్చింది.

ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.  సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (82725) జనవరి 10న సాయంత్రం 6 గంటలకు  సికింద్రాబాద్‌ లో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (07256) రైళ్లు జనవరి 12, 13వ తేదీల్లో రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, మరునాడు ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుతాయి.

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు(82731) జనవరి 11వ తేదీ రాత్రి 7.25 గంటలకు  సికింద్రాబాద్‌ లో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం  6 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07255) జనవరి 18న సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌ లో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (82727) జనవరి 19న రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌ నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.

More Telugu News