Uttam Kumar Reddy: తప్పుకుంటానని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు... వారసుడి వెతుకులాటలో కాంగ్రెస్!

  • మునిపిపల్ ఎన్నికల తరువాత రాజీనామా
  • నల్గొండ ప్రజలకు దగ్గరగా ఉంటానన్న ఉత్తమ్
  • టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు

తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. హుజూర్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని వెల్లడించిన నేపథ్యంలో కొత్త బాస్ ఎవరవుతారన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు దగ్గరగా ఉంటూ, కోదాడ, హుజూర్ నగర్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఇకపై తాను కృషి చేస్తానని, పురపాలక సంఘాల ఎన్నికల తరువాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని ఉత్తమ్ స్వయంగా వెల్లడించారు. ఉత్తమ్ తప్పుకుంటారని, గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతూనే ఉంది.

ఇక ఉత్తమ్ ఖాళీ చేసే పోస్ట్ కి చాలా మంది నేతలు పోటీలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం రెండు, మూడు పేర్లను మాత్రమే పరిశీలిస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిల్లో ఒకరికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని తెలుస్తోంది.

యువతలో క్రేజ్ ఉండటంతో రేవంత్ కు పదవి దక్కుతుందని ఓ వర్గం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అవకాశం లభిస్తుందని మరో వర్గం వాదిస్తోంది. అయితే, రేవంత్ అభ్యర్థిత్వంపై మాత్రం కొందరు నేతలు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్ బాబుకు అనుకూలంగా రాష్ట్రంలోని కొందరు సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలావుండగా, ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ పదవిపై దృష్టిని సారించకపోవచ్చని తెలుస్తోంది. తొలుత ఏఐసీసీ ప్రక్షాళన జరగాల్సివుందని, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి ఎన్నికైన తరువాతే, రాష్ట్రాలపై దృష్టిని సారిస్తామని సీనియర్ నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా స్థానంలోనూ మరో నేత రావచ్చని సమాచారం.

More Telugu News