వయసును తక్కువ చేసి చూపిన ఫలితం.. భారత యువ క్రికెటర్ మన్‌జోత్ కల్రాపై ఏడాది నిషేధం

02-01-2020 Thu 07:43
  • వయసు తగ్గించి చెప్పి అండర్-16, అండర్-19కు ఎంపిక
  • దేశవాళీ క్రికెట్‌లో రెండేళ్లు, రంజీల్లో ఏడాది పాటు ఆడకుండా నిషేధం
  • నిర్ణయం ప్రకటించిన డీడీసీఏ అంబుడ్స్‌మన్

భారత యువ క్రికెటర్ మన్‌జోత్ కల్రాపై ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఏడాది నిషేధం విధించింది. దేశవాళీ పోటీలు అండర్-16, అండర్-19కు ఆడే సమయంలో తన అసలు వయసును తగ్గించి చెప్పి ఎంపికైనందుకు గాను డీడీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించడంలో కల్రా విఫలం కావడంతో ఢిల్లీ క్రికెట్ సంఘం ఏడాది పాటు వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

డీడీసీఏ ఉత్తర్వుల ప్రకారం.. ఏజ్ గ్రూప్ పోటీల్లో రెండేళ్లు, రంజీల్లో ఏడాది పాటు ఆడడానికి మన్‌జోత్ కల్రా అనర్హుడు. ఈ మేరకు డీడీసీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ (రిటైర్డ్) బదర్ దురెజ్ తెలిపారు. బీసీసీఐ రికార్డుల ప్రకారం మన్‌జోత్ ప్రస్తుత వయసు 20 ఏళ్ల 351 రోజులు కాగా, ఇటీవల అండర్-23లో ఆడాడు. బెంగాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కల్రా 80 పరుగులు చేశాడు.

రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు శిఖర్ ధవన్ తిరిగి జట్టులో చేరడంతో ఆ స్థానంలో ఢిల్లీ జట్టుకు కల్రా ఎంపికయ్యాడు. అయితే, తాజా వేటుతో  అతడు ఏడాదిపాటు రంజీలకు ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.