హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభం

01-01-2020 Wed 22:09
  • 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి ఈటల
  • పాల్గొన్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని ,మేయర్ రామ్మోహన్ 
  • భద్రతను అందించడానికి రూ.3 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడి

హైదరాబాద్ లో నుమాయిష్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రి ఈటల రాజేందర్ తన సహచర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ 18 కళాశాలలు నిర్వహిస్తోందన్నారు. వీటిలో 35 వేల మంది విద్యార్థులను చదివిస్తోందని చెప్పారు.

గత ఏడాది ఎగ్జిబిషన్ లో జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన భద్రతను అందించడానికి రూ.3 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. 25 శాతం ఆదాయం తగ్గుతున్నప్పటికీ భద్రతా ప్రమాణాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తొలిరోజే సందర్శకులు నుమాయిష్ కు వెల్లువెత్తారు. సందర్శకులతో స్టాళ్లన్నీ  కిటకిటలాడాయి.