భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు చంద్రబాబు కొట్టేసిన భూములు: వైసీపీ నేత పుష్ప శ్రీవాణి

01-01-2020 Wed 21:37
  • ‘హెరిటేజ్’ పేరిట కొన్న భూములకు లెక్కలు చెప్పాలి
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణతో బాబుకు భయం పట్టుకుంది?
  • అందుకే, ఇంట్లో ఆడవాళ్లని తెచ్చి రాజకీయం చేస్తున్నారు

అమరావతి పరిరక్షణ సమితికి చంద్రబాబునాయుడు భార్య భువనేశ్వరి తన చేతి గాజును విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విమర్శలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని అన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ గురించి చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే, ఇంట్లో ఆడవాళ్లని తెచ్చి రాజకీయం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని రైతులను నిండా ముంచింది చంద్రబాబు కాదా? టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా? అని ప్రశ్నించిన పుష్ప శ్రీవాణి, ‘హెరిటేజ్’ పేరిట కొనుగోలు చేసిన భూములకు భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.