Bihar CM: బీహార్ సీఎం ఆస్తుల్లో వృద్ధి లేదు.. పశువుల పాకలో రెండు ఆవులు, ఓ దూడ మాత్రమే పెరిగాయి

  • తాజాగా ప్రకటించిన వార్షిక ఆస్తుల నివేదికలో వెల్లడి
  • గత ఏడాది ఎనిమిది ఆవులు, ఆరు ఆవు దూడలు
  • ఈ ఏడాది ఆవుల సంఖ్య పది, దూడల సంఖ్య ఏడు

బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన వార్షిక ఆస్తుల వెల్లడిలో గత ఏడాది (2018)తో పోలిస్తే.. కేవలం రెండు ఆవులు మాత్రమే పెరిగాయని ప్రకటించారు. నిన్న నితీశ్ తో పాటు అతని మంత్రివర్గ సహచరులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2010 నుంచి నితీశ్, తన మంత్రివర్గ సహచరులు ఏటా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని నిబంధన విధించారు.

ఈ మేరకు ప్రతీ ఏడాది జనవరి మొదటి వారం లేదా ఏడాది చివరి రోజు  నితీశ్ అతని సహచరులు తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. గత ఏడాది తన ఆస్తుల్లో  ఒక పశువుల పాక, ఎనిమిది ఆవులు, ఆరు ఆవు దూడలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది(2019) వాటి సంఖ్యను పది ఆవులు, ఏడు ఆవు దూడలుగా చూపించారు.

2018లో తనవద్ద రూ.42వేల నగదు ఉన్నట్లు చూపిన నితీశ్ ప్రస్తుతం  తన వద్ద ఉన్న నగదును రూ.38,039 గా చూపెట్టారు. వీటితో పాటు రూ.16లక్షల విలువైన చరాస్తులు, ఢిల్లీలో ఫ్లాట్ తో కలుపుకుని రూ.40లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. నితీశ్ కుమారుడు తండ్రి కంటే ఎక్కువగా రూ.1.39 కోట్ల విలువైన చరాస్తులు, రూ.1.48కోట్ల స్థిరాస్తులు కలిగివుండటం గమనార్హం. ఈ ఆస్తులు తన తల్లినుంచి వారసత్వంగా సంక్రమించినట్లు ప్రకటించారు. కాగా, తన మంత్రి వర్గ సహచరుల్లో చాలా మంది ఆయన కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉండటం విశేషం.

More Telugu News