ఎంఐఎంతో కలిసి పోటీ చేయం: మంత్రి కేటీఆర్

01-01-2020 Wed 18:05
  • 2019 వ సంవత్సరం తమ పార్టీకి మంచి ఆరంభం ఇచ్చింది
  • 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుతో శుభారంభం చేస్తాం
  • ఎన్పీఆర్, ఎన్నార్సీలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి తమ పార్టీ పోటీ చేయదని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ రెండు పార్టీల మధ్య స్నేహపూరిత సంబంధాలున్నప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని మంత్రి తెలిపారు. 2019 వ సంవత్సరం తమ పార్టీకి మంచి ఆరంభం ఇచ్చిందంటూ.. 2020లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో విజయంతో శుభారంభం చేస్తామని అన్నారు.

తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. కొత్త మున్సిపల్ చట్టం అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. చట్టం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కౌన్సిలర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్పీఆర్, ఎన్నార్సీలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ లో పాతబస్తీకి మెట్రో తప్పకుండా వస్తుందని మంత్రి తెలిపారు.