ఒకవైపు మంటలు.. మరోవైపు సముద్ర తీరాన చిక్కుకున్న పర్యాటకులు

01-01-2020 Wed 17:23
  • ఆస్ట్రేలియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
  • మంటలతో ప్రభావితమైన  న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాలు
  • పొగ అలముకోవడంతో చీకటిగా మారిన ప్రాంతాలు

ఆస్ట్రేలియా అడవుల్లో రేగిన కార్చిచ్చు క్రమంగా విస్తరించి అడవులను, గడ్డి మైదానాలను బూడిద చేస్తోంది. ఈ మంటలు తీవ్రం కావడంతో.. తమ దేశంలో పర్యటిస్తున్న పర్యాటకులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, మంటలు వేగంగా న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు వ్యాపించడంతో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సుమారు 4 వేలమంది పర్యాటకులు సమీపంలోని బీచ్ లకు ఉరుకులు, పరుగులతో చేరుకున్నారు. కొత్త సంవత్సరాన్ని వేడుకగా జరుపుకోవాలనుకున్న ఆ పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సముద్ర కెరటాలు.. మరోవైపు విస్తరిస్తున్న మంటల మధ్య పర్యాటకులు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంటల ప్రభావంతో  దట్టంగా పొగలు వ్యాపించడంతో..ఆ ప్రాంతాలు చీకటిగా మారాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందిగా మారింది. అయినా అగ్నిమాపక సిబ్బంది మంటల నార్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని స్థానిక అధికారులు తెలుపుతున్నారు.