Amaravathi: రాజధాని మారుస్తామంటే కేంద్రం, బీజేపీ చూస్తూ ఊరుకోవు: ఎంపీ సుజనా చౌదరి

  • రైతులు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలి
  • ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ స్లోగన్ తో ముందుకెళ్లాలి
  •  అధికారపక్షం తరపున పోలీసులు పనిచేయొద్దు

అమరావతి రైతులపై పోలీసుల అత్యుత్సాహం తగదని, కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. ‘సేవ్ అమరావతి’, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ట్యాగ్ లైన్స్ తో ఓ ట్వీట్ చేసిన సుజన, ఈ సందర్భంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమరావతి రైతులను కలిసిన సుజనా చౌదరితో రైతులు తమ బాధలు వ్యక్తం చేస్తుండటం ఈ వీడియోలో కనబడుతుంది. రైతులు, వారి కుటుంబీకులు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.  

అరెస్టు చేసిన రాజధాని రైతులపై సెక్షన్ 307 అమలు చేసిన విషయాన్ని సుజనా చౌదరి వద్ద ఓ రైతు భార్య ప్రస్తావించగా, దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేద్దామని, కొంచెం ఓపిక పడితే, ఈ అంశాన్ని ముందుకు తీసుకెళతామని హామీ ఇచ్చారు. రైతులకు నష్టం జరగకుండా చూసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు.

రాజధాని తరలించొద్దంటున్న తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయని ఆరోపిస్తున్నారని అన్నారు. రైతులు శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని, ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ స్లోగన్ తో రైతులు తమ నిరసనలు తెలపాలని సూచించారు. రాజధాని మార్చాలన్నది అంత తేలికకాదని, ఇదేమీ చిన్నపిల్లల వ్యవహారం కాదని, కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ చూస్తూ ఊరుకోవని చెప్పారు. అధికారపక్షం తరపున పోలీసులు పనిచేయొద్దని, న్యాయపరంగా పని చేయాలని సూచించారు.  

నాడు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి శిలాఫలకం వద్ద మౌనదీక్ష చేసున్న సమయంలో ‘మమ్మల్ని మీరు పెయిడ్ ఆర్టిస్టులా? ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారుటగా?’ అని ఓ ఛానెల్  ప్రతినిధి తమ వాళ్లను అడగడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఇక్కడే ఉంటే.. చంపేస్తారని చెప్పి’ సదరు ఛానెల్ ప్రతినిధిని పంపించి వేశామని చెప్పారు.

More Telugu News