2020లో ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు సాగాలి: గవర్నర్ తమిళిసై

01-01-2020 Wed 14:06
  • రాజ్ భవన్ లో ప్రజలతో కలవడం సంతోషాన్నిచ్చింది 
  • గవర్నర్‌గా వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి
  • బోడగూడెం గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

2020 సంవత్సరం తెలంగాణ ప్రజలందరికీ సుఖ శాంతులు కలిగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆకాక్షించారు. ప్రజలు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లుగా చెబుతూ.. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్ భవన్ కు వచ్చిన ప్రజలతో కలవడం చాలా సంతోషం కలిగించిందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యాయని తమిళిసై తెలిపారు. ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో బ్లడ్ డొనేషన్ యాప్ విడుదల చేశారని, రాజ్‌భవన్ ఆధ్వర్యంలో దానిపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు. బోడగూడెం అనే ట్రైబల్ గ్రామానికి చెందిన కొంతమంది తనను కలిసి వాళ్ళ సమస్యలు వివరించారన్నారు. వారి  సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.