సీఏఏను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలకు షాక్ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం!

01-01-2020 Wed 13:18
  • సీఏఏను వ్యతిరేకిస్తున్న కొన్ని రాష్ట్రాలు
  • జిల్లా కలెక్టర్ ద్వారా దరఖాస్తులను పక్కన పెట్టనున్న కేంద్రం
  • ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు

పౌరసత్వ సవరణ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ఆ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే కొందరు ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, చట్టం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఆన్ లైన్ ద్వారా పౌరసత్వం కల్పించాలని భావిస్తోంది.

జిల్లా కలెక్టర్ ద్వారా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విధానానికి బదులుగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్టు చెప్పాయి. కొత్త విధానం ద్వారా సీఏఏను ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయవచ్చని తెలిపాయి.

సీఏఏ ద్వారా 2014 డిసెంబర్ 31కు ముందు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ ల నుంచి వచ్చిన హిందూ, సిక్కు, జైన్, పార్సీ, బుద్దిస్ట్, క్రిస్టియన్ శరణార్థులకు మన దేశ పౌరసత్వం లభిస్తుంది.